ఉగాది వేళ విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పద మృతి, ఘటనాస్థలంలో సైనైడ్
ఉగాది వేళ విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పద మృతి, ఘటనాస్థలంలో సైనైడ్
సత్యసాయి జిల్లా మడకశిరలో ఉగాది పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా కనిపించాయి. మృతులను కృష్ణ చారి, సరళ, సంతోష్, భువనేష్ గా పోలీసులు గుర్తించారు. కృష్ణ చారి, సరళ దంపతులు కాగా సంతోష్, భువనేష్ వారి సంతానం. వారిలో కుమారుడు సంతోష్ ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
ఈ ఘటనపై మడకశిర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారిది హత్యనా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కృష్ణ చారి ఇరుగుపొరుగు, సమీప బంధుమిత్రుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వారి కుటుంబానికి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు ఉన్నాయా అనే కోణంలో ఆరాతీస్తున్నారు. లేదంటే ఎవరి నుండి అయినా వారికి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు.
నీళ్ల బాటిల్లో సైనైడ్
కృష్ణ చారి ఇంట్లో సెనైడ్ కలిపిన వాటర్ బాటిల్ లభించింది. దాంతో వారు సెనైడ్ సేవించిన కారణంగానే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కృష్ణ చారి బంగారం వ్యాపారం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం కృష్ణ చారి కుటుంబానికి కోట్ల రూపాయల్లో అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారే ఆత్మహత్య చేసుకున్నారా లేక ? ఈ ఘటన వెనుక మరెవరి ప్రమేయమైనా ఉందా అనే విషయంలోనే ప్రస్తుతానికి పోలీసులు ఇంకా ఒక నిర్థారణకు రావాల్సి ఉంది.
సెనైడ్ అనేది ఒక విష రసాయనం. సాధారణంగా ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కానీ బంగారం పని చేసే వారికి జువెలరీ మేకింగ్‌లో సెనైడ్ అవసరం ఉంటుంది. అలా కృష్ణ చారి ఇంట్లో కూడా పోలీసులకు సెనైడ్ ఆనవాళ్లు లభించాయి. స్థానిక డీఎస్పీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.