జనసేన-బీజేపీల కలయిక చంద్రబాబుకు షాకేనా?
జనసేన, బీజేపీతో చేతులు కలపడం చంద్రబాబుకు షాకేనా? ముచ్చటగా మున్సిపోల్స్‌లో సేనతో కలిసి కవాతు చేద్దామనుకుంటే, పవన్ మాత్రం కమలంతో ప్రయాణం కట్టడం, బాబుకు మింగుడపడటం లేదా?
జనసేన, బీజేపీతో చేతులు కలపడం చంద్రబాబుకు షాకేనా? ముచ్చటగా మున్సిపోల్స్‌లో సేనతో కలిసి కవాతు చేద్దామనుకుంటే, పవన్ మాత్రం కమలంతో ప్రయాణం కట్టడం, బాబుకు మింగుడపడటం లేదా? తనకంటూ ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు కూడా హ్యాండివ్వడం, టీడీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారా? తనతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కలిసే అవకాశంలేదని భావిస్తున్న బాబుకు, పవన్ అడుగులు అస్సలు నచ్చడం లేదా? బీజేపీ-జనసేన కలయికతో చంద్రబాబు ఎందుకంతగా గాబరాపడుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారపక్షం వైసీపీ ఒకవైపు ఉండగా, విపక్షాలు రెండు కూటములుగా మారాయి. తెలుగుదేశం ఒకవైపు ఉండగా, ఇప్పుడు బీజేపీతో కలిసి జనసేన మూడో శక్తిగా మారింది. వచ్చే మున్నిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయించాయి. అయితే, బీజేపీ-జనసేనలు ఒక జట్టుగా మారడంతో, తెలుగుదేశానికి షాకిచ్చినట్టయ్యింది.
జనసేనతో కలిసి ఆందోళనాకార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మొన్న వైజాగ్‌లో జనసేన లాంగ్‌మార్చ్‌కు సీనియర్ నేతలను పంపడం కూడా అందుకే. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనందుకే, ఓట్లు చీలిపోయి ఓడిపోయామని భావిస్తున్న చంద్రబాబు, తాజాగా జనసేన కూడా తమకు దూరం జరగడం, బీజేపీతో జట్టుకట్టడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్న మాటలు వినపడ్తున్నాయి.
ఒక్క రాజధానే ముద్దు, మూడు రాజధానులు వద్దూ అంటూ తెలుగుదేశం ఆందోళనలు చేస్తోంది. జనసేన కూడా ఇదే నినాదంతో, విడిగానే నిరసనలు చేస్తోంది. ఈ ఊపులోనే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి, అత్యధిక స్థానాలు గెలిచి, అటు అధికారపక్షాన్ని నిలువరించడమే కాకుండా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని బాబు ఆలోచిస్తున్నారు. అయితే, ఈ ఆలోచనకు జనసేన అధినేత షాకిచ్చారు. దీంతో మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేయకతప్పదని మథనపడిపోతున్నారు చంద్రబాబు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికివారు విడివిడిగా పోటీ చేసినందుకే ఓట్లు చీలిపోయి, అంతిమంగా వైసీపీకి మేలు జరిగిందని ఇప్పటికే బాధపడిపోతున్నారు బాబు. ఇప్పుడు కూడా విడివిడిగా పోటీ చేస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి, అధికార వైసీపీకే ప్రయోజనం కలుగుతుందని ఫీలవుతున్నారట చంద్రబాబు. మొత్తానికి బీజేపీ, జనసేన జట్టుకట్టడం చంద్రబాబుకు రుచించడం లేదని అర్థమవుతోంది. కేవలం ఎన్నికల్లో ఓట్ల చీలికే కాకుండా, ఈ ఇద్దరి జట్టు సూపర్‌హిట్టయితే, టీడీపీ నుంచి వలసలు పెరుగుతాయని, అది మరింత ప్రమాదకరమని టెన్షన్ పడుతున్నారట. చూడాలి, రాజకీయ అపరచాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, అటు వైసీపీ, ఇటు బీజేపీ-జనసేనలను ఎలా ఎదుర్కొంటారో, లేదంటే బీజేపీ-జనసేనలే తనతో నడిచేలా రాజకీయాన్ని రసవత్తరం చేస్తారో.