నాటి పవన్‌ ప్రసంగం నేడు ఇరుకున పెడుతోందా?

Update: 2019-12-20 11:11 GMT
పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్, గతంలో కర్నూల్లో పర్యటించిన టైంలో చేసిన వ్యాఖ్యల వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు రాజధానుల కలకలం నేపథ్యంలో తాజాగా పవన్ చేస్తున్న ట్వీట్లను కూడా జత చేస్తూ, కొందరు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మూడు రాజధానుల చక్రబంధంలో జనసేనానికి చిక్కులు తప్పవనడానికి ఇదే నిదర్శనమంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఆంధ‌్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదనపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ప్రపోజల్‌పై విమర్శలు చేస్తున్నారు. 'ఒక్క అమరావతికే దిక్కు లేదు కానీ, జగన్ రెడ్డి మూడు అమరావతులు అంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా?' అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. దీంతో పాటు 'ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి.' అని నిలదీశారు పవన్. అంతేకాదు, 'హైకోర్టు కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూల్‌కి వెళ్లాలా ? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా?' అని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మొత్తానికి మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కల్యాణ్. 'హైకోర్టు కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూల్‌కి వెళ్లాలా అనడం ద్వారా, కర్నూల్లో హైకోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, కొందరు రాయలసీమకు చెందిన నేతలు అంటున్నారు. ఇదే సమయంలో గతంలో కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడు, అక్కడ మాట్లాడిన వీడియోను చాలామంది షేర్ చేస్తున్నారు. అప్పుడేమో కర్నూలు గురించి అలా, ఇప్పుడేమో ఒకలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. ఇంతకీ నాడు పవన్‌ ఏం మాట్లాడారు.

గతంలో పవన్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'అమరావతే మనకు రాజధాని కావొచ్చు. నా మనసుకి మాత్రం కర్నూలే రాజధాని. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజు అమరావతి ఏ స్థాయి నగరం అవుతుందో అంతకుమించిన నగరాన్ని చేసి పెడతా. కర్నూలుకి, రాయలసీమకి పూర్వవైభవం తీసుకొస్తా.' అంటూ పవన్ కళ్యాణ్ అన్న మాటలు జనసేన పార్టీ ఫేస్‌బుక్ అధికారిక అకౌంట్‌లో ఉన్నాయి. నాడు కర్నూల్‌పై ప్రేమ కురిపించిన పవన్ కల్యాణ్, నేడు హైకోర్టు ప్రతిపాదనపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, రాయలసీమకు చెందిన జనం విమర్శలు చేస్తున్నారు. తన మనసులో ఇప్పటికీ కర్నూలే రాజధాని అన్న పవన్, నేడు మరో రాజధాని అవుతున్నందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి నాటి ప్రసంగం వీడియో, నేటి ట్విట్టర్‌ కామెంట్లు, జనసేన అధినేతను ఇరుకునపెడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తే, మిగతా రెండు ప్రాంతాల్లో పార్టీకే నష్టమని అంటున్నారు. విపక్షాలకు ఈ పరిణామం విపత్కరంగా మారిందని, ఏం మాట్లాడినా మరో ప్రాంతంలో వ్యతిరేకత రావడం ఖాయమని చెబుతున్నారు. టీడీపీ, జనసేనలు ఈ సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాయో, మూడు ప్రాంతాల ప్రజలను ఎలా ఒప్పిస్తాయో, కాలమే తేల్చాలి.

Full View

Tags:    

Similar News