సీఎం జగన్ మాట తప్ప, మరెవరి మాటా వినని తెగేసి చెప్పారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తనకు బాస్ జగనేనని, మిగతా ఎవరేం చెప్పినా చెవికెక్కించుకోనని అనేశారు. తనకెవరూ నీతులు చెప్పాల్సిన అవసరంలేదని అంటున్నారు. కలువొద్దన్న వారిని కలుస్తూ, మాట్లాడొద్దన్న విషయాలు మాట్లాడుతూ, పార్టీలో కొరకురాని కొయ్యలా మారిన రఘురామ ధైర్యమేంటి? వైఎస్ఆర్ ఆత్మ తనకు అండగా వుంది, ఇక ఎదురేలేదని ఆయన భావిస్తున్నారా?
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏం మాట్లాడినా సంచలనమే. తాను చెయ్యాలనుకున్నది చేసేస్తారు. తాను అనాలనుకున్నది కుండబద్దలుకొట్టేస్తారు. ఎవరిని కలువొద్దని పార్టీ అధిష్టానం లక్ష్మణ గీత గీస్తే, దాన్ని దాటి మరీ చూపిస్తారు రఘురామకృష్ణంరాజు.
ఈమధ్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గీతను దాటుతూ, తనకు తాను వివాదాలను సృష్టించుకుంటున్నారని పేరు తెచ్చుకుంటున్నారు రాజు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్‌లో పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడారని హైకమాండ్ సీరియస్సయ్యింది. అదేపనిగా కేంద్రమంత్రులను కలవడంపైన కూడా, ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిసింది. పలకరించినా, పలకరించకపోయినా వివిధ పార్టీల అధినేతలను కలవడం, నమస్కారాలు పెట్టడంపై కూడా కోప్పడ్డారట పార్టీ పెద్దలు. పార్లమెంట్ లాబీల్లో మోడీ తనను పలకరించడాన్ని కూడా రఘురామకృష్ణంరాజు ప్రచారం చేసుకోవడం, వైసీపీ అధిష్టానానికి ఏమాత్రం నచ్చలేదట. వీటికితోడు, ఢిల్లీలో పెద్ద ఎత్తున విందు ఇవ్వడం, కేంద్రమంత్రులతో పాటు ఇతర పార్టీల ఎంపీలను ఆహ్వానించడం కూడా అగ్నికి ఆజ్యంపోసినట్టయ్యింది. పార్టీ లైన్‌ను దాటి, వద్దంటున్నా రఘురామకృష్ణంరాజు ఇలాంటి కార్యకలాపాలు చేస్తుండటంపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోంది.
రఘురామ కృష్ణ వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే, ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని, రాజకీయ పండితులు అంటున్నారు. వైసీపీ పెద్దలు కూడా ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు, నరసాపురంలో ఆయనకు ప్రత్యర్థులైన గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ స్వయంగా కండువా కప్పి ఆహ్వానించారు. రాజుకు ప్రత్యామ్నాయంగా అక్కడ లీడర్‌షిప్‌ను డెవలప్ చేసేందుకే, ప్రత్యర్థులను ప్రోత్సహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో రాజు సైతం రగిలిపోతున్నారట.
గోకరాజు ఫ్యామిలీని పార్టీలోకి ఆహ్వానించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట రఘురామకృష్ణంరాజు. కొందరు కావాలనే తనపై జగన్‌కు చెడుగా చెబుతున్నారని సన్నిహితులతో అంటున్నారట. రాజు కోపమంతా కొందరు ఎంపీలతో పాటు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీదేనని, ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారట. అందుకే ఈమధ్య తనకు జగన్ తప్ప మరెవరూ బాస్ లేరని, ఎవరు చెప్పినా వినని తెగేసి చెప్పారు రఘురామ కృష్ణంరాజు. సుబ్బారెడ్డి మీద ఒంటికాలి ఎందుకు లేస్తున్నారంటే, ఆయన రాజును చాలాసార్లు హెచ్చరించారట. పార్టీ గీత దాటొద్దని వార్నింగ్ ఇచ్చారట. దీంతో సుబ్బారెడ్డి అంటే సీరియస్ అయిపోతున్నారట రాజు. పార్టీ పెద్దలను సైతం ధిక్కరించేంత ధైర్యం ఈయనకు ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే, రఘురామ రాజు ధైర్యమంతా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువేనని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
వైఎస్‌ఆర్ ఆత్మ బంధువు కేవిపీ రామచంద్రరావు. రఘురామకు సైతం బంధువు కేవీపీ. ఇద్దరూ వియ్యంకులు. మొన్న ఢిల్లీలో రఘురామ రాజు విందు ఇచ్చింది కూడా కేవీపీ ఇంట్లోనే. తన వెనక కేవీపీ ఉన్నారు కనుకే, రఘురామ చెలరేగిపోతున్నారని, ఏమైనా ప్రాబ్లమైనా ఆయనే చూసుకుంటున్నారన్న ధైర్యంతోనే రాజు పార్టీ లైన్‌ను దాటి ప్రవర్తిస్తున్నారని, వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట.
కేవీపీ రామచంద్రరావుతో వైఎస్ ఫ్యామిలీకి ఇప్పటికీ అటాచ్‌మెంట్ వుంది. జగన్ నేరుగా ఆయనతో పెద్దగా మాట్లాడకపోయినా, కేవీపీ, వైఎస్ కుటుంబాలు తరచుగా కలుస్తుంటాయి. వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతితో పాటు కొందరు బంధువులు కేవీపీ కుటుంబంతో బాగానే వున్నారు. రఘురామ కృష్ణం రాజు ధైర్యం కూడా అదేనని కొందరు అంటున్నారు. తనపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా, కేవీపీ చక్రంతిప్పుతారని, విజయమ్మతోనైనా మాట్లాడతారని, రఘురామ కాన్ఫిడెన్స్ అట. కేవీపీ అలాంటి సహకారాలు అందిస్తారా, అంటీముట్టనట్టు వ్యవహరిస్తారా అనేది ఎవరూ గట్టిగా చెప్పకపోయినా, రాజు నమ్మకం మాత్రం అదేనని వైసీపీ కార్యకర్తల మాట.
తన వ్యవహారశైలిపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా వున్నా, తన దారి తనదేనన్నట్టుగా రఘురామ కృష్ణంరాజు బిహేవ్ చేయడం వెనక కూడా కేవీపీ ధైర్యంతో పాటు మరో స్ట్రాటజీ కూడా వుందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీతో సస్పెండ్ చేయించుకుని, బీజేపీలోకి వెళ్లాలన్నది ఆయన వ్యూహమట. కానీ వైసీపీ అలాంటి పని మాత్రం చేయడానికి సిద్దంగా లేదు. కానీ, రఘురామకృష్ణంరాజుకు ఎలాంటి పనులు, కాంట్రాక్టులూ ఇవ్వొద్దని బీజేపీ పెద్దలకు సైతం వైసీపీ నేతలు చెప్పారట.
మొత్తానికి రఘురామ కృష్ణం రాజు వ్యవహారం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని అర్థమవుతోంది. తన దారి తనదే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తుండటం, బీజేపీకి దగ్గరయ్యేందుకు తాపత్రయం హైకమాండ్‌కు సీరియస్ అయ్యేలా చేస్తోంది. మొత్తానికి బీజేపీ వైపు వెళ్లాలనే తెగింపుతోనే ఇలా చేస్తున్నారా లేదంటే, తన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు అండతో ఇలా పార్టీ లైన్ దాటుతున్నారా అన్నది మాత్రం, ఆయన సన్నిహితులకే తెలియాలి అంటున్నారు వైసీపీ నేతలు. చూడాలి, రఘురామకృష్ణంరాజు మున్ముందు ఎలాంటి సంచనాలు సృష్టిస్తారో.