జనసేనలో నాదెండ్లపై కొత్త రచ్చేంటి.. నాదెండ్లపై కొందరు నేతల అసహనానికి కారణమేంటి?

Update: 2020-02-04 07:48 GMT
జనసేనలో నాదెండ్లపై కొత్త రచ్చేంటి.. నాదెండ్లపై కొందరు నేతల అసహనానికి కారణమేంటి?

జనసేనలో పవన్‌ కల్యాణ్‌ తర్వాత ఆ‍యనదే పెత్తనమా? పవన్‌‌కు మించికూడా పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్నారా? జనసేన నుంచి వరుసగా నేతలు బయటకు రావడానికి ఆ‍యన తీరూ కారణమన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? దేవుడిని దర్శించాలంటే, మొదట పూజారిని ప్రసన్నం చేసుకోవాలన్నట్టుగా, ఆయన పర్మిషన్ ఇస్తేనే పవన్‌ను కలిసేంత కట్టుదిట్టం చేశారా? ఆయన పెత్తనాన్ని భరించలేక ఒక్కొక్క బుల్లెట్‌ బయటకొస్తోందా? మొత్తం పార్టీని, పవన్‌ ఆయన చేతుల్లోనే పెట్టేశారన్న చర్చకు కారణమేంటి? ఇంతకీ ఆయన ఎవరు? సదరు నేతపై పార్టీ నేతలకు ఎందుకంత కోపం?

జనసేన తుపాకీలోంచి ఒక్కో బుల్లెట్‌, పేలకుండానే జారుకుంటోంది. ఒక్కొక్కరూ ఏకే 47లా దూసుకెళతారనుకుంటే, పీకే టీంలోంచి తుస్సుమంటూ వెళ్లిపోతున్నారు. ట్రిగ్గర్‌ నొక్కకుండానే బుల్లెట్లు బలవంతగా బయటికొచ్చేస్తున్నాయి. మొన్న మాజీ ఎమ్మెల్యే ఆకుల, నిన్న పార్టీ సిద్దాంతకర్త రాజు రవితేజ తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు. నేడు ఏకంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గుడ్‌ బై చెప్పారు. వీళ్లందరూ బయటకు రావడానికి పవన్‌ తీరు, సిద్దాంతాల మార్పే కారణం కాదట. జనసేనలో పార్టీ అధినేత కంటే ఎక్కువ హడావుడి చేస్తున్న మరో నాయకుడు కూడానట. ఇంతకీ పార్టీ ప్రెసిడెంట్‌ తర్వాత తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ లీడర్‌ ఎవరు?

అవును. నాదెండ్ల మనోహర్ అట. చూడ్డానికి సౌమ్యంగా, పార్టీ అధినేతకు రైట్‌ హ్యాండ్‌లా కనిపిస్తున్న నాదెండ్లే, పార్టీలో సంక్షోభం తలెత్తడానికి మొదటి కారణమని, పార్టీ బయటికొచ్చేసిన నేతలు తమ అనుచరులతో అంటున్నారట. పవన్‌ కల్యాణ్‌, పార్టీ బాధ్యతలన్నీ, నాదెండ్లకు అప్పగించేశారని, దీంతో నాదెండ్ల చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా నడుస్తోందని మండిపడ్తున్నారట. చాలా విషయాల్లో పవన్‌ను తప్పుదారి పట్టించింది కూడా నాదెండ్లేనంటూ నేతలు రగిలిపోతున్నారట.

రాపాక వరప్రసాద్‌. ఈ‍యనా నాదెండ్ల మనోహర్‌ బాధితుడేనట. పార్టీ నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యేనైన తనను, నాదెండ్ల మనోహర్‌ దూరం పెట్టారని మండిపడ్తున్నారట రాపాక. పవన్‌ను కలవాలని ఎన్నిసార్లు అడిగినా, ఎంతసేపు వెయిట్‌ చేసినా, నాదెండ్ల కలనివ్వరని వాపోతున్నారట. కనీసం పార్టీ కార్యక్రమాలకు, వేదిక మీదకూ తనను పిలవరని, సమాచారమివ్వరని ఫైర్‌ అవుతున్నారట రాపాక. తాను పార్టీ కార్యక్రమాలకు వస్తే, గెలిచిన రాపాకకు చప్పట్లు కొడతారని, పవన్‌తో పాటు తామూ ఓడిపోయాం కాబట్టి, అది తమకు ఇబ్బందికరంగా మారుతుందని నాదెండ్ల ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారని, రాపాక తన అనుచరులతో ఆవేదన పంచుకున్నారట. తనకూ, పవన్‌ కల్యాణ్‌కు గ్యాప్‌ ఏర్పడ్డానికి నాదెండ్ల కారణంటున్నారట. దళిత ఎమ్మెల్యేనైన తనపట్ల, నాదెండ్ల దరుసుగా ప్రవర్తించారని, గౌరవం ఇవ్వకుండా మాట్లాడారని, చాలాసార్లు తన సన్నిహితుల దగ్గర వేదన వెళ్లగక్కారట రాపాక. అందుకే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మారాల్సి వస్తోందని అంటున్నారట రాపాక.

ఇక రాజు రవితేజ. జనసేన పార్టీ సిద్దాంతకర్త. పవన్‌ అంతరంగాన్ని ఆవిష్కరించే ఇజమ్‌ పుస్తక రచయిత. ఈయన కూడా జనసేనకు రాజీనామా చేశారు. పవన్‌ కల్యాణ్‌ సిద్దాంతాలు, భావజాలంలో చాలా తేడా వచ్చిందని, అందుకే తాను పార్టీ నుంచి బయటికొచ్చేశానని మీడియా ప్రెస్‌మీట్‌లో చెప్పారు రవితేజ. చేగువేరా బొమ్మ పెట్టి, కమ్యూనిస్టులతో చెలిమి చేసిన పవన్‌, ఇఫ్పుడు బీజేపీకి దగ్గరకావడానికి, ఆ పార్టీ భావజాలాన్ని భుజాలపై మోయడానికి, నాదెండ్ల మనోహరే కారణమని, తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట రాజు రవితేజ. తన తండ్రిని బీజేపీలోకి పంపించిన నాదెండ్ల, పవన్‌ను సైతం కాషాయానికి దగ్గర చేసేందుకు ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారని, కళ్లముందు ఇంత జరుగుతున్నా, ఇంకా పార్టీలోనే వుంటే, ఆత్మహత్యా సదృశమని భావించి, బయటికొచ్చేశానని, చెప్పుకున్నారట రవితేజ.

ఇక తాజాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ‍యన సైతం అనూహ్య పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేశారు. పవన్‌లో నిలకడలేకపోవడం, మళ్లీ సినిమాలకు క్లాప్‌ కొట్టడమే కారణమని, లేఖలో చెప్పినా, తెర వెనక కారణాలు వేరే వున్నాయన్నది, జనసైనికుల మాట. సమాజంలో తనకెంతో ఫాలోయింగ్ వున్నా, పార్టీలో కనీస గుర్తింపులేదని, అందుక్కారణం నాదెండ్ల మనోహరేనని జేడీ లోలోపల రగిలిపోతున్నారట. బీజేపీతో పొత్తు నిర్ణయం, సంప్రదింపుల్లోనూ తనను ఏమాత్రం ఇన్‌వాల్వ్ చేయలేదని, నాదెండ్ల ఆలోచనలతోనే, పవన్‌ తనను పక్కకు పెడుతున్నారన్నది జేడీ కంప్లైంట్‌ అట. పార్టీలో నెంబర్‌ టూగా వుంటూ, మిగతా ఎవ్వరూ తెరమీదకు రాకుండా నాదెండ్ల అడ్డుకుంటున్నారని జేడీ, తన అనుచరుల దగ్గర వాపోతున్నారట.

నాదెండ్లపై నాగబాబు కూడా ఒకింత అసహనంగా వున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో నాగబాబు కూడా కీలక సభ్యుడిగా వున్నా, నాదెండ్ల మాత్రం కూరలో కరివేపాకులా పక్కనపెట్టేస్తున్నారట. పార్టీలో సోదరుల అలికిడి పెరిగితే కుటుంబ పార్టీగా ముద్రపడే ప్రమాదముందని, తనను దూరం పెడుతున్నారని అంటున్నారట నాగబాబు. మొత్తానికి జనసేన నుంచి బయటికి వెళ్లిపోతున్న హేమాహేమీ నాయకులు, పవన్‌తో పాటు నాదెండ్లను కూడా టార్గెట్‌ చేస్తున్నారట. నాదెండ్ల సలహాలతో పవన్‌ సైతం, గుడ్డిగా వెళ్లిపోతున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేశారని విమర్శిస్తున్నారట. నాదెండ్లపై నాయకుల మాటల్లో నిజమెంత వుందో గానీ, నిప్పులేందే పొగరాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Full View


Tags:    

Similar News