West Godavari: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు..!
* మంటల్లో ముగ్గురు సజీవదహనం.. కాలిన గాయాలతో బయటపడిన వ్యక్తి ఆస్పత్రికి తరలింపు
Fire Accident: ప్రశాంతంగా ఉన్న పల్లెపరిసరాల్లో భీకర శబ్ధంతో దద్దరిల్లింది. బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంతో మంటలు ఎగసిపడ్డాయి. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో కాలిపోయారు. పేలుడు ధాటికి పనిచేస్తున్న కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయి. కొందరు మంటల్లో చిక్కి సజీవదహనంకాగా, మరికొందరు కాలిన గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలం చేరుకుని మంటలను అదుపుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
ప్రాధమికంగా ముగ్గురు సజీవ దహనమైనట్లు సమాచారం. రాత్రి సమయం కావడంతో ఎవరు ఎక్కడున్నారనే గుర్తించలేని పరిస్థితి. ఒకరు మాత్రం కాలిన గాయాలతో పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. అరుపులు కేకలు విన్న పరిసరవాసులు ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు బాణాసంచా పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమ పనితీరు, పనిచేసే కార్మికుల వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
బాణా సంచా పరిశ్రమ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ ప్రశాంతి కడియద్దకు చేరుకున్నారు. గాయాలతో బయటపడిన కార్మికుడికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బాణాసంచా పరిశ్రమ నిర్వాహకులపై సమగ్ర వివరాలు తెలుసుకుని చర్యలు చేపడుతామన్నారు.