Guntur: రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
Guntur: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు
Guntur: ఏపీలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణ హత్య చేసినట్లు ఆధారాలతో రుజువు కావడంతో ఉరి శిక్ష విధిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే రమ్యను హత్య చేశాడు. అయితే ఇంత జరిగినా విచారణ సమయంలో కోర్టులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని నిందితుడి మాటల్లో, వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదని తప్పు చేశాననే పశ్చాత్తాపం లేకపోవడంతో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తున్నామని తీర్పు వెల్లడించిన సమయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
రమ్యకు జరిగిన ఘోరం ఎవ్వరికీ జరగకూడదని ఆమె ఆత్మకు శాంతి కలిగిందంటున్నారు రమ్మ తల్లిదండ్రులు. ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షలు పడాలనే అప్పుడే నేరాలు తగ్గుతాయన్నారు. గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు.