జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందా, లేదా?

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయమై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన రోజున జరిగిన ఘటనలను ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు.

Update: 2024-06-26 11:50 GMT

జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందా, లేదా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిన తరువాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు రెండో రోజు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఆ మరునాడు హాజరు కాలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అసెంబ్లీని బహిష్కరించింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. మరి 10 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? ఒక వేళ వైసీపీ సభ్యులు సభకు హాజరైతే, అధికారపక్షం ఏ రకంగా వ్యవహరిస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అసెంబ్లీకి దూరంగా ఉన్న చంద్రబాబు, జగన్

రాష్ట్ర విభజన తరువాత 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు. అప్పట్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించాలని 2017 అక్టోబర్ 25న వైఎస్ఆర్సీపీ శాసనసభపక్షం నిర్ణయం తీసుకుంది. జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన తరువాతే జగన్, ఆయన సహచర ఎమ్మెల్యేలు 2019 జూన్ 12న అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ అసెంబ్లీకి రెండున్నర ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. చంద్రబాబు అసెంబ్లీకి దూరంగా ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హజరయ్యారు. అసెంబ్లీలో తన భార్యను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేశారన్న చంద్రబాబు, అది శాసన సభ కాదు కౌరవ సభ అని విమర్శించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెడతానని శపథం చేశారు. అలా చంద్రబాబు 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత జూన్ 21న ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు.


ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కు జగన్ లేఖ

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయమై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన రోజున జరిగిన ఘటనలను ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు. సీఎం ప్రమాణం చేసిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని, అలా చేయకపోవడంతో తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని సంకేతాలు ఇచ్చారని ఆ లేఖలో చెప్పారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం నిబంధనలకు విరుద్దమని జగన్ అభిప్రాయపడ్డారు.

చట్టసభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా కూడా లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ప్రకారం... అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షపార్టీల్లో ఎక్కువ మంది సభ్యులున్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. గతంలోని కొన్ని సందర్భాలను ఆయన ఆ లేఖలో ఉదహరించారు. 1984లో లోక్ సభలోని 543 ఎంపీ స్థానాల్లో, 30 సీట్లను గెలిచిన టీడీపీని అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 1994లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు గెలిచినా కూడా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించిన అంశాన్ని ఆ లేఖలో చెప్పారు.


అప్పట్లో అసెంబ్లీలో జగన్ ఏమన్నారు?

వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో టీడీపీకి 23 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఐదారుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొంటే టీడీపీ బలం అసెంబ్లీలో 17 కు పడిపోతే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తనకు కొందరు చెప్పారన్నారు. కానీ, చంద్రబాబు వ్యవహరించినట్టుగా చేయలేదని వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే అసెంబ్లీ సభ్యుల్లో 10 శాతం మంది ఎమ్మెల్యేలుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని జగన్ ఒప్పుకొన్నారని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఒక రకంగా, విపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడడం జగన్ కే చెల్లిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రతిపక్ష హోదాపై నిబంధనలు ఏం చెబుతున్నాయి?

చట్టసభల్లో ప్రతిపక్ష హోదాపై విషయమై రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చారు. ఆర్టికల్ 168 నుండి 221 వరకు రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి నిర్వహణ, విధుల గురించి పొందుపర్చారు. దీని ప్రకారంగా చట్టసభల్లోని మొత్తం సభ్యుల్లో 10 శాతం సభ్యులున్న పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. లోక్ సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 మంది సభ్యులున్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. అసెంబ్లీలో విపక్షమైన వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే ఆ పార్టీకి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అవసరం. టెక్నికల్ అంశాలను పక్కన పెట్టి జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు చెప్పారు. లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందన్నారు.


జగన్ వాదన ఏంటి?

చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై రూల్స్ ను పక్కనపెట్టి కొత్త సంప్రదాయాలను నెలకొల్పిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదే అంశాన్ని వైఎస్ జగన్ తన లేఖలో ప్రస్తావించారు. చట్ట సభల్లో 10 శాతం సభ్యులుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధనను కొన్ని సమయాల్లో పక్కన పెట్టి కొత్త సంప్రదాయాలను తెరమీదికి తెచ్చిన సందర్భాలను జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖలో గుర్తు చేశారు.

టెక్నికల్ అంశాలను పక్కన పెట్టి సంప్రదాయాల ప్రకారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్ కు దక్కకపోతే పరోక్షంగా ఆయనకు టీడీపీ కూటమి ప్రయోజనం కలిగించినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

11 మంది ఎమ్మెల్యేలున్న జగన్ అసెంబ్లీకి హజరైతే అధికార కూటమి ఎలా రిసీవ్ చేసుకుంటుంది? మాట్లాడే అవకాశం దక్కుతుందా లేదా అనే చర్చ తెరమీదికి వచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ వ్యవహరించినట్టుగానే టీడీపీ కూడా వ్యవహరిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వని కారణంగానే అసెంబ్లీకి దూరంగా ఉంటున్నామని జగన్ పార్టీ చెప్పుకొనేందుకు టీడీపీ పరోక్షంగా అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని విశ్లేషకులు కృష్ణాంజనేయులు అన్నారు.

వైఎస్ జగన్ రానున్న రోజుల్లో అసెంబ్లీకి హజరు కావాలో వద్దో నిర్ణయించుకొనే అవకాశం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా విషయమై స్పీకర్ కు లేఖ రాసి అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో నెట్టారు. అసెంబ్లీకి హాజరు కావద్దని నిర్ణయం తీసుకొంటే ప్రజలకు తమ వైఖరిని చెప్పుకోవడానికి కూడా అవకాశం కూడా ఆయనకు దక్కుతుంది.

Tags:    

Similar News