నేడు ప్రధానితో సీఎం జగన్‌ సమావేశం

నేడు ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 10 గంటల 20నిమిషాలకి నేరుగా ప్రధాని ఇంటికి బయల్దేరి వెళ్లనున్న జగన్‌..

Update: 2020-10-06 01:49 GMT

నేడు ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 10 గంటల 20నిమిషాలకి నేరుగా ప్రధాని ఇంటికి బయల్దేరి వెళ్లనున్న జగన్‌.. 10.40 గంటలకు మోదీతో సమావేశమవుతారు.. సుమారు గంటపాటు చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అపెక్స్‌ కౌన్సిల్‌ వీడియో సమావేశంలో పాల్గొంటారు. కాగా ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసిన వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అలాగే పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్ భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి.

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి రావలసిందిగా నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి కోరతారు. ఇక కేంద్రమంత్రులతో భేటీ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మోదీతో జరిగే సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, రాష్ట్ర విభజన హామీలు, చెల్లించాల్సిన బకాయిలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News