విభజనతో నష్టపోయాం.. ఏపీని ఆదుకోండి..

Update: 2019-12-20 07:16 GMT
జగన్

రాష్ట్రానికి కేంద్రం అందిస్తోన్న ఆర్థిక సాయాన్ని పెంచాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు ఏపీ సీఎం జగన్. సీఎం జగన్‌తో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఓ నివేదికను ఆయన అందజేశారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నివేదికలో పేర్కొన్న సీఎం విభజన చట్టం హామీల మేరకు రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని కోరారు.

విభజన గాయాలు ఏపీని ఇంకా బాధిస్తున్నాయని రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు సీఎం జగన్. అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదార రీతిలో సహాయం చేయాలని 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌తో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలోని బృందం సమావేశం జరిగింది. సుమారు 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రం కష్టాల్లో ఉన్నందున కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పరిస్థితులపై ప్రజంటేషన్‌ ఇచ్చి నివేదిక సమర్పించారు.

భౌగోళికంగా ఈ రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయని, రాయలసీమ లాంటి ప్రాంతాలు నిరంతరం కరువుతో అల్లాడుతున్నాయని చెప్పారు సీఎం జగన్. కోస్తాజిల్లాల్లో 8 జిల్లాలపై తుపాన్లు తరచుగా దండెత్తుతున్నాయన్నారు. పట్టణీకరణ దేశ సగటుతో పోలిస్తే తక్కువ దేశంలో పట్టణ జనాభా సగటున 31.16 శాతం అయితే ఏపీలో 29.6శాతం మాత్రమే. పౌష్టికాహార లోపం రాష్ట్రంలో అధికంగా ఉందన్నారు. 31.9శాతం మంది బాధపడుతున్నట్టు తెలిపారు.

విభజన వల్ల రాష్ట్రంగా బాగా దెబ్బతిందన్న జగన్ విభజన చేసిన గాయాలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తున్నాయన్నారు. అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని, రాజధానిని కోల్పోయామని చెప్పారు. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. రాష్ట్ర విభజన వల్ల పారిశ్రామిక, సేవారంగాల వాటా బాగా తగ్గిపోయిందని, పారిశ్రామిక రంగం వాటా 25.2 నుంచి 23.4శాతానికి పడిపోయిందని తెలిపారు.

తలసరి ఆదాయం కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీకి తక్కువన్నారు. షెడ్యూలు 9లో ఉన్న ఆస్తుల విభజన ఇంకా జరగలేదని, షెడ్యూల్‌ 10లో ఉన్న ఆస్తులు 142 ఉంటే తెలంగాణకు 107, ఏపీకి 15 మాత్రమే వచ్చాయని వివరించారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ఇక్రిశాట్‌ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయినట్టు తెలిపారు. బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, హెచ్‌ఏఎల్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయన్నారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన 5,127 కోట్లు, దీనిపై వడ్డీ 604.7 కోట్లు ఇంకా రాలేదని చెప్పారు జగన్. ఆర్థిక అసమతుల్యతను ఏపీ ఎదుర్కొంటోందని, మిగులు నిధుల నుంచి లోటు ఎదుర్కొనే పరిస్థితిలోకి వచ్చామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం సిఫార్సు చేయాలని కోరారు. రెవిన్యూ లోటు భర్తీ కింద రూ.18 వేల,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ. 3వేల,979 కోట్లు మాత్రమే వచ్చాయి. వెనకబడిన జిల్లాల్లో చాలా ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు లేదని, అక్షరాస్యతశాతం తక్కువగా ఉందని తెలిపారు. ఆరోగ్య ప్రమాణాలు సరిగ్గాలేవని, వెనుకబడిన జిల్లాలకు 24,350 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ.1.050 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు జగన్.

ఇక పోలవరం ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,103 కోట్లు ఇంకా విడుదలచేయాల్సి ఉందన్నారు. సవరించిన ప్రాజెక్టు అంచనా 55వేల ,548.87 కోట్లకు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులకోసం, పునరావాస చర్యల కోసం రూ.16వేల కోట్లు విడుదల చేయాలన్నారు. వెంటనే పోలవరానికి నిధులు విడుదలచేయాల్సిందిగా సిఫార్సు చేయాలన్నారు. అలాగే, విభజన చట్టం ప్రకారం దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మించాల్సి ఉందన్నారు. రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించామని, తగిన సహాయంకోసం సిఫార్సు చేయమని కోరారు సీఎం.

మరోవైపు ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌లు, ట్యాక్స్‌ మినహాయింపులుకూడా చట్టంలో పెట్టారని, వాటిని వెంటనే అమలుచేయాల్సిందిగా రికమెండ్‌ చేయాలని కోరారు కడప స్టీల్‌ ప్లాంట్‌ను విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాలని, వెంటనే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటును ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ వల్ల 8వేల నుంచి10వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. గోదావరి – పెన్నా లింక్‌ వయా బొల్లాపల్లి రిజర్వాయర్‌ ప్రాజెక్టుకు తగిన నిధులు ఇచ్చేలా సహాయపడాలన్నారు. సీఎం జగన్ ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరడంతో అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది ఆర్థిక సంఘం.

Full View 

Tags:    

Similar News