సొంతూరుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సీజేఐగా తొలిసారి స్వగ్రామానికి...
CJI NV Ramana: మధ్యాహ్నం వరకు గ్రామస్థులతో గడపనున్న ఎన్వీ రమణ...
CJI NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ తన సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామమైన పొన్నవరానికి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన స్వగ్రామంలోనే గడపనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
ఆయన కుటుంబీకులు, స్నేహితులు, పొన్నవరం గ్రామస్తులు.. ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. గ్రామ ముఖద్వారం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. గ్రామంలో దాదాపు నాలుగు గంటలసేపు ఎన్వీ రమణ గడపనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ కంచికచర్లలో పాఠశాల విద్యను అభ్యసించారు. పొన్నవరంలో ఆయన కుటుంబానికి పొలాలు ఉన్నాయి.
ఆయన పెదనాన్న కుమారుడు నూతలపాటి వీరనారాయణ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటోంది. ఇవాళ సోదరుడి నివాసంలోనే భోజనం ఏర్పాట్లు చేశారు. ఇక, పొన్నవరం నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచి గుంటూరు జిల్లా చందోలు గ్రామ ఆలయంలో పూజలు చేసిన అనంతరం పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. తిరిగి విజయవాడ చేరుకుంటారు.