Terror Attack At Jammu & Kashmir : జమ్మూకశ్మీర్ మాచిల్ సెక్టార్‌లో ఆదివారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వీర జవాన్లు వీరమరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్ఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం చెందారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డి డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు వీరమరణం పొందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని, సైన్యం వీరోచితగాథల గురించి తమకు స్ఫూర్తిదాయకంగా చెప్పేవాడని పలువురు యువకులు చెప్పారు. సెలవుల్లో గ్రామానికి వస్తే యువకులతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చెప్పేవారు. గ్రామానికి పండుగకు వస్తే అందరితోనూ కలిసిపోయేవారు. హుషారుగా ఉండే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతి చెందడం గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి మృతిచెందడం బాధగా ఉందని యువత, స్నేహితులు, బంధువులు అతడి జ్ఞాపకాలను గుర్తించేసుకుంటున్నారు.