Chandrababu: జైలు నుంచి వచ్చాక చంద్రబాబు ఆలయ సందర్శనలు
Chandrababu: రాబోయే ఎన్నికల్లో దేవుడి ఆశీస్సులు ఉండాలని యాగం
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఒకసారిగా ఆధ్యాత్మికతలోకి వెళ్లిపోయారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత వరుసగా దేవాలయాలను సందర్శించిన ఆయన ఉండపల్లిలోని తన నివాసంలో యాగం నిర్వహించారు. చంద్రబాబు ఇలా ఆధ్యాత్మికతలోకి వెళ్లడం 2024 ఎన్నికల కోసమా, లేక జైల్ నుంచి బయటకు వచ్చినందుకా..?
4దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన చంద్రబాబు వరుసగా ఆలయాలను దర్శించుకున్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ, సింహాచల అప్పన్న, గుణదల మేరీమాత ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తమిళనాడు వెళ్లి అక్కడి ఆలయాలను కూడా దర్శించుకుని వచ్చారు. అంతటితో ఆగకుండా తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా 3రోజుల పాటు యాగాలు నిర్వహించారు చంద్రబాబు. ఇందులో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు ఆదిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్ధితులు కలిసి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సతీమణి మొక్కుకున్న, మొక్కు బడులు తీర్చుకుంటూ రాజకీయంగా కూడా యాక్టివ్ అవుతూ 2024 ఎన్నికల గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.