నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Chandrababu: మధ్యాహ్నం 2 గం. తర్వాత గన్నవరం నుంచి ఢిల్లీకి చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇవాళ రాత్రి కానీ, గురువారం కానీ ఆయన అమిత్‌షాతో సమావేశమవుతారని తెలుస్తోంది. భేటీ అనంతరం గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాతో భేటీకానుండటం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయం కాగా.. బీజేపీ సైతం ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం మిగిలి ఉండటంతో.. పొత్తుల అంశాన్ని తేల్చాలని భావిస్తున్నారట. చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందని సమాచారం. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనంతరం పొత్తులపై ఓ క్లారిటీ రానుంది. ఎన్డీయే పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది.
మరో రెండు రోజుల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల పొత్తుపై క్లారిటీ రానుంది. ఒక వేళ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు అంశంపై దృష్టి సారిస్తారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో ఈ నెలాఖరులోపే ఎన్డీయే అభ్యర్థులను ప్రకటించి.... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచించనున్నారు.