Chandrababu Naidu: ఇవాళ రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం
Chandrababu Naidu: మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్...
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ఆయన తమ పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. ఏపీలో ఇటీవల టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చంద్రబాబు తనను కలిసేందుకు రాష్ట్రపతి సమయమిచ్చారు. రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు టీడీపీ నేతలపై జరిగిన దాడులను వివరించనున్నారు. దీంతో పాటు డ్రగ్స్ మాఫియాపై కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వినతిపత్రం ఇవ్వనున్నారు. అయితే కోవిడ్ కారణంగా చంద్రబాబు సహా ఐదుగురు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు.
ఢిల్లీలో ఇవాళ రేపు పర్యటించనున్న చంద్రబాబు.. రాష్ట్రపతితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలోని పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే అపాయింట్‌మెంట్‌లపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఎన్డీయేతో పాటు విపక్ష నేతలను కూడా ఢిల్లీ టూర్‌లో కలుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీడీపీ నేత పట్టాభి ఇళ్లు, టీడీపీ కార్యాలయంపై దాడులను సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు.. ఢిల్లీ పర్యటనలో పెద్దల్ని కలిసేందుకు ప్లాన్ చేయడంతో ఎవరెవరిని కలుస్తారు..? ఆ తర్వాత జరిగే పరిణామాలేంటనే ఉత్కంఠ నెలకొంది.