Vizag gas leak: ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరవాడలో రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజీపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజి మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరమన్నారు. విశాఖలో వరుస గ్యాస్ లీకేజీలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్యాస్ లీకేజీ బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
విశాఖ లో మరోసారి గ్యాస్ కలకలం రేపింది. గతంలో పాలిమర్స్ లో గ్యాస్ లీకవగా, ఈ దఫా ఫార్మా కంపెనీలో ఘటన చోటుచేసుకుంది. సైనారా కెమికల్స్ లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాయువు పీల్చిన వారిని గాజువాక ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.