AP Municipal Elections: కాకరేపుతోన్న గుంటూరు మున్సి"పోల్"
AP Municipal Elections: నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరం తర్వాత ప్రస్తుతం పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది.
AP Municipal Elections: నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరం తర్వాత ప్రస్తుతం పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి గుంటూరులో మొదలైంది.దశాబ్ద కాలంతార్వాత ఎన్నికలు జరుగుతుండంతో అటు అధికార వైసీపీ.. ఇటు ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. పంచాయతీ పోరు ముగియడంతో అన్ని పక్షాల నాయకులు పుర పోరుపై దృష్టి సారించారు. దీంతో మున్సిపల్ కేంద్రాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గుంటూరు నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికారపార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పెరిగిన ధరలు తమకు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తుండగా.... సంక్షేమం తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని వైసీపీ లెక్కగడుతోంది. జనసేన, బీజేపీ, వామపక్షాలు ఏదో రూపంలో తమకు అంతో ఇంతో చోటు దక్కుతుందని విశ్వసిస్తున్నాయి.
ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్ష కానుందా ..
గుంటూరు జిల్లాలో పురపాలక పోరు ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్ష కానుంది. గత ఏడాది అర్థంతరంగా ఆగిన మున్సిపల్ ఎన్నికలు ఈ సారి ఏరూపంలో ఉండబోతాయోనన్న ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కరోనా కారణంగా గత ఏడాది నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడి నుంచే ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి 10న పోలింగ్ జరగనున్నది. అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు.
16 ఏళ్ల తర్వాత ఎన్నికలు...
చుట్టుపక్కల పంచాయతీల విలీనం అనంతరం 16 ఏళ్ల తర్వాత గుంటూరు నగర పాలక సంస్థకు ఈ సారి ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరులో మొత్తం 57 డివిజన్లు ఉండగా ఇప్పటికి 569 మంది నామినేషన్లు వేయగా పరిశీలన అనంతరం 555 నామినేషన్లను ఆమోదించారు. అత్యధికంగా 42వ డివిజన్‌లో 18 మంది, అత్యల్పంగా 23వ డివిజన్‌లో నలుగురు ప్రస్తుతానికి ఎన్నికల బరిలో ఉన్నారు.గుంటూరు రాజధాని జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టగా భావిస్తున్నాయి.
జెండా పాతాలనే పట్టుదలతో వైసీపీ...
అధికార పక్షం వైసీపీ తొలిసారిగా గుంటూరు నగర పాలక సంస్థపై జెండా పాతాలని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ తరపున మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ రేసులో కావటి మనోహర్‌నాయుడు, పాదర్తి రమేష్ గాంధీల పేర్లు వినపడుతున్నాయి. ఈ సారి గుంటూరు కార్పొరేషన్వై సీపీదేనని ఆ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిరాశలో టిడిపి...
ఇక టీడిపి విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశలో ఉన్నారు. తెలుగు తమ్ముళ్లు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రను రెండు రోజుల క్రితం పిలిపించుకుని కార్యచణ ఇచ్చారు. కార్పొరేటర్ సీటును ఆశిస్తున్న పలువురు వివిధ డివిజన్లలో ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. దీనిపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. వాటిని సరిచేసే పనిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడకు అప్పగించారు. చివరవరకు వేచి చేసే ధోరణి లేకుండా రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి అభ్యర్థుల ఎంపిక వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని టీడీపీ వ్యూహం సిద్ధం చేస్తోంది.
గట్టి పోటీ ఇస్తోన్న జనసేన.....
గుంటూరు పురపాలక ఎన్నికల్లో జనసేన గట్టిపోటికి సిద్దమౌతుంది. పంచాయితీ ఎన్నికల మాదిరిగానే తమ సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు జన సైనికులు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు గుంటూరులో ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 57 డివిజన్లకు గాను ౪౦ డివిజన్లలో తన అభ్యర్థులను నిలిపి ప్రచారం మొదలు పెట్టింది ఆ పార్టీ ప్రచార బాధ్యతలను సీనియర్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్‌వలీలు తమ భుజాలపైన వేసుకున్నారు. బీజేపీ జనసేన పొత్తుతో బరిలో నిలిచింది. 18 వార్డుల్లో బీజేపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. సీపీఎం తరపున ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సీపీపీ అభ్యర్థులు 7 డివిజన్లలో నామినేషన్లు వేశారు. పట్లు నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు
ఏకగ్రీవాల దిశగా పయనం.....
మాచర్ల.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెలతో పాటు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవాల దిశగానే పయనిస్తోంది. 31 వార్డులకు 61 నామినేషన్లు దాఖలయ్యాయి. పది వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలైంది. వీరంతా వైసీపీ అభ్యర్థులే. ఆరు నామినేషన్లు స్ర్కూట్నీలో పోయాయి.వినుకొండలో ౩౨ వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో వైసీపీ ఉంది. చిలకలూరిపేట మునిసిపాలిటీలో గణపవరం, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాలు విలీనంతో ౩౮ వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 229 నామినేషన్లను ఆమోదించారు. వీటిల్లో టీడీపీ 88, వైసీపీ 90, జనసేన 8, బీఎస్పీ 1, బీజేపీ 2, సీపీఎం 3, కాంగ్రెస్ 7, ఇతరపార్టీలు 6, ఇండిపెండెంట్లు 24నామినేషన్లు ఉన్నాయి. కొందరు అభ్యర్థులు మరణించడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 28న తిరిగి నామినేషన్లు స్వీకరించనున్నట్లు అదికారులు తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 40వార్డులుంటే 182 నామినేషన్‌లు చెల్లుబాటయ్యాయి. టీడీపీ 84, వైసీపీ 58, జనసేన 14, కాంగ్రెస్10, బీజేపీ, స్వతంత్రులు ఏడు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
రేపల్లె పురపాలక సంఘంలో....
రేపల్లె పురపాలక సంఘంలో 28 వార్డులు ఉండగా 124 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించారు.పిడుగురాళ్ల పురపాలక సంఘంలో 33 వార్డులకు టీడీపీ 43, వైసీపీ 74, జనసేన 5, ఇతరులు అరుగురు నామినేషన్లు వేశారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన టీడీపీ, జనసేన అభ్యర్థులతో ఉపసంహరించుకునేలా అధికార పార్టీ ప్రయత్నిస్తుందని సమాచారం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ...ఎదేమైనప్పటి ఇటు కార్పోరేషన్ అటు పురపాలక ఎన్నికలతో జిల్లాలో రాజకీయ హీటు మొదలైంది. అధికారపక్షం ప్రతిపక్షం వారు ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తు వారి వారి జెండాలను కార్పోరేషన్మున్సిపాలిటీలపై పాతాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు వారి ప్రయత్నాలు ఎంతవరకు పలిస్తాయో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సందే.