Mekapati Goutham Reddy: తండ్రికి తగ్గ తనయుడు..
Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు.
Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యుల హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మేకపాటికి వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంపట్ల తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మేకపాటి మరణం పట్ల ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1971 నవంబర్ 2న జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. తన తండ్రి రాజమోహన్ రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజమోహన్ రెడ్డి ముగ్గురు కుమారుల్లో గౌతమ్ రెడ్డి ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు. గౌతమ్ రెడ్డి బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. గౌతమ్ రెడ్డి 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేకపాటి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు.