వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే.. అప్పుడు మళ్లీ మీరే మంత్రులు - జగన్

YS Jagan - Cabinet: మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లా అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగా అవకాశం...

Update: 2022-04-08 04:37 GMT

వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే.. అప్పుడు మళ్లీ మీరే మంత్రులు - జగన్

YS Jagan - Cabinet: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సీఎం జగన్ రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక మంత్రులు సీఎం జగన్‌కు రాజీనామాలను సమర్పించారు. రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.. ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధి.. అంకితభావంతో పనిచేస్తామన్నారు మంత్రులు.

మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే 2019, జూన్‌ 8న మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాని సీఎం జగన్ అన్నారు. వెయ్యి రోజులు మంత్రులుగా అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రెండేళ్లలో జరిగే ఎన్నికలకు మీ అనుభవం, సమర్థత పార్టీకి అవసరమన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే మళ్లీ మీరు ఇవే స్థానాల్లో కూర్చుంటారని భరోసా ఇచ్చారు సీఎం జగన్. మంత్రులుగా తప్పించినవారికి భవిష్యత్తులో ఏమాత్రం గౌరవం తగ్గకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ బాధ్యతలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల అభివృద్ధి మండళ్ల అధ్యక్షులుగానూ అవకాశమిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయడం జిల్లా అభివృద్ధి మండళ్ల బాధ్యత అని సీఎం వెల్లడించారు. అయితే కొత్తగా మంత్రులుగా ఎవరిని నియమిస్తున్నారని ఉత్కంఠగా మారింది. పాత క్యాబినేట్‌లో కొందరికి మినహాయింపు ఉంటుదని సీఎం వెల్లడించారు.

ఇందుకు మంత్రులంతా అంగీకరించారు. అధినేత ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. రాజీనామా చేసిన మంత్రుల్లో చాలామంది క్యాబినెట్ తరువాత అనందంగా బయటకు వస్తూ కనిపించారు. తాము ఆనందంగా రాజీనామా చేశామని మంత్రి పదవి వచ్చినా రాకపోయినా ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తామని వారంటున్నారు.

మరోవైపు క్యాబినెట్‌లో సీనియర్లు అయిన పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని కొనసాగుతారంటూ క్యాబినేట్ భేటీ తరువాత సహచర మంత్రుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక సామాజిక సమీకరణాల్లో భాగంగా గుమ్మనూరు జయరామ్, చెల్లుబోయిన వేణుగోపాల్, అదిమూలపు సురేష్, శిథిరి అప్పలరాజు కొనసాగుతారని పలువురు మంత్రులు అంటున్నారు. మొత్తానిరీ ఎవరు కొత్తగా ఎంట్రీ ఇస్తారు. ఎవరు కొనసాగుతారో తెలియాలంటే ఈనెల 11వరకు వేచి చూడాల్సిందే.. 

Tags:    

Similar News