ఆర్కేకు కీలక పోస్టు సిద్దంగా ఉందా?

Update: 2019-06-13 12:27 GMT

మంత్రి పదవిలో చోటు ఖాయమని ప్రచారం జరిగి, బెర్త్ దక్కని మరో నాయకుడు ఆర్కే. మరి రోజా తరహాలోనే ఆర్కేకు కూడా జగన్‌ కీలకమైన సంస్థకు ఛైర్మన్ చెయ్యబోతున్నారా? దీంతో ఆర్కే అసంతృప్తి చల్లారుతుందా?

ఆర్కే....ఆళ్ల రామకృష్ణా రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి పదవి దక్కకపోవడంతో మరోసారి ఆర్కే పేరు రాష్ట్రమంతా చక్కర్లు కొడుతోంది. రోజాతో పాటు మంత్రివర్గంలో చోటు ఖాయమని వినిపించిన పేర్లలో ఆర్కే ఒకరు. మంగళగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే. రాజధానికి భూములిచ్చిన రైతుల తరపున పోరాటం చేసి, పతాక శీర్షికలెక్కారు. ఓటుకు నోటు కేసులో టీడీపీని ఇరుకునపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేశారు. మంగళగిరిలో ఏకంగా చంద్రబాబు కుమారుడు, నాటి మంత్రిగా ఉన్న లోకేష్‌నే ఓడించి, రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యారు. అయితే మంగళగిరిలో లోకేష్‌ను ఓడిస్తే, ఆర్కేను మంత్రిని చేస్తానని హామి కూడా ఇచ్చారు జగన్. కానీ రకరకాల సమీకరణల నేపథ్యంలో కేబినెట్‌లో ఆర్కేకు చోటు కల్పించలేదు.

ఆర్కేకు క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడంతో పార్టీలోను, రాష్ట్రవ్యాప్తంగానూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు, ఆర్కేకు మంత్రి పదవి ఖాయమని, ప్రమాణస్వీకారానికి రావాలని, ఫోన్‌ కూడా చేశారట. తీరా లిస్టులో మాత్రం పేరు మాయమైందట. ఈ పరిణామాలతో తీవ్ర కలత చెందిన ఆర్కే, మంత్రుల ప్రమాణస్వీకారానికి సైతం వెళ్లలేదు. తన సన్నిహితులతో మాత్రం ఆవేదన పంచుకున్నారు. దీంతో ఆర్కేకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు, ఆలోచన చేస్తున్నారట జగన్. కీలకమైన ఓ సంస్థ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారట.

రాజధాని రైతుల తరపున పోరాడిన ఆర్కేకు, చివరికి రాజధానితో లింకున్న పదవిని ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సీఆర్డీఏకు ఆర్కేను ఛైర్మన్‌ చేయాలని ఆలోచిస్తున్నారట జగన్. ఇప్పటికే రోజాకు ఏపీఐఐసీ, చెవిరెడ్డికి తుడా ఛైర్మన్‌ పదవులను ఇస్తున్న జగన్‌, ఆర్కేకు సైతం కీలకమైన పోస్టు ఇవ్వాలని డిసైడయ్యారట. సీఆర్డీఏ బాధ్యతలు అప్పగిస్తే, ఆ పోస్టుకు న్యాయం చేయడమే కాదు, ఆర్కే అసంతృప్తిని కూడా చల్లబరిచినట్టు ఉంటుందని అనుకుంటున్నారట. ఎలాగూ రెండో విడతలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని పక్కాగా హామి ఇచ్చారట. మొత్తానికి మంత్రి పదవి దక్కలేదని బాధపడుతున్న ఆర్కే,కు, సీఆర్డీఏ ఛైర్మన్‌ గిరితో సముచితమైన స్థానమిచ్చినట్టువుతుందని భావిస్తున్నాట ఆయన అనుచరులు. మరి సీఆర్డీఏ పదవి ప్రపోజల్‌కు ఆర్కే ఓకే అంటారా?

Full View

Tags:    

Similar News