Tirupati Laddu: అసలేమిటీ వివాదం... 10 పాయింట్స్
చంద్రబాబు ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు.
తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన చర్చకు దారి తీసింది. చంద్రబాబు ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే నెయ్యిలో కల్తీ అంశాన్ని తెరమీదికి తెచ్చారని చెప్పారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
తిరుపతి లడ్డూ వివాదంలో 10 ముఖ్యాంశాలు
1. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు ఆరోపించారు. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా ఉందనే విషయం తేలిందని ఆయన చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే ప్రయత్నాలు ప్రారంభించామని ఈ నెల 18న టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
2. లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె ఉందని ఎన్ డీ డీ బీ కాఫ్ సంస్థ నివేదిక తెలిపిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. నెయ్యి నాణ్యత ఎస్ విలువ 97.96 నుంచి 102.04 మధ్య ఉండాల్సి ఉండగా... పరిమితికి మించి 116.09గా ఉందని తేలింది.
3. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నెయ్యి అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారం కట్టుకథ అని ఆయన చెప్పారు. నెయ్యి సరఫరా చేసే ప్రతి ట్యాంకర్ ఎన్ ఏబీఎల్ సర్టిఫికెట్ తెస్తారని ఆయన గుర్తు చేశారు.
4. నెయ్యి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తిరుమల ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు తనపై చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
5. తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ నెయ్యిని సరఫరా చేస్తోంది. అయితే 2023 తర్వాత ఈ సంస్థ టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు. తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియకు దూరంగా ఉంది.
6. నెయ్యి కల్తీకి బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదలబోమని చంద్రబాబు చెప్పారు. తిరుమలకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ నాకూ ఉందన్నారు.
7. బాలాజీ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వుందని తేలడం అపచారమని తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు. గతంలో తాను అప్పటి టీటీడీ ఈవో, ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు.
8. దేశంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయస్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యి కల్తీలో బాధ్యులను వదలబోమని ఆయన చెప్పారు.
9. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ సంస్థ తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. నియమ నిబంధనల మేరకే నెయ్యిని సరఫరా చేశామని ప్రకటించింది.
10. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారంతో నీచరాజకీయాలకు తెరతీశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. విష ప్రచారం, నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.