అమ్మని మించిన దైవం మరొకటి లేదు. అలాంటి అమ్మ ప్రేమకు అంతులేదు. పిల్లల కోసం తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు చర్చనీయాంశం మారింది. అమ్మ ప్రేమ ఎలాంటిదో అందరికి అర్ధమయ్యేలా చేసింది. బిడ్డ కోసం ఓ తల్లి చేసిన పోరాటానికి అందరు సలాం కొట్టుతున్నారు. పట్టువదలని ఆమె ధైర్యానికి అందరు శబ్బాష్ అంటున్నారు. ఇంతకీ ఆ తల్లి ఏం చేసిందో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే.
ఈ మహిళ తన కొడుకును చూడకుండా ఉండలేకపోయింది. లాక్ డౌన్ కారణంగా రోజులు గడుస్తున్నా తన కుమారుడు తన దగ్గరకు రాలేకపోతున్నాడనే బాధ ఆమెను ఓ పట్టాన ఉండనివ్వలేదు. దీంతో ఏదైతే అది జరుగుతుంది అనుకుని కుమారుడిని తీసుకొచ్చేందుకు స్కూటీ ఎక్కి బయలుదేరింది ఆ మహిళ. ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కన్న కొడుకును తన ఇంటికి తెచ్చుకుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఉపాధ్యాయురాలైన రజియా కుమారుడు నిజాముద్దీన్ స్నేహితుడి తండ్రి అనారోగ్యంగా ఉండటంతో మార్చి 14న నెల్లూరులోని రెహ్మతాబాద్‌కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. అసలే కష్టకాలం దానికితోడు కొడుకును చూడలేక ఉండలేకపోయిన ఆ మాతృమూర్తి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. అవేవీ సఫలం కాకపోవడంతో కొడుకు మీద బెంగపెట్టుకున్న రజియా ఈ నెల 6న ఉదయం బోధన్ నుంచి 700 కీలోమీటర్ల దూరంలో ఉన్న కొడుకు కోసం స్కూటీ ఫై ఒంటరిగా సాహసయాత్రను చేసింది.
పోలీసు ఉన్నతాధికారి నుంచి అనుమతి పత్రాన్ని తీసుకుని తన ప్రయాణాన్ని సాగించింది. తినడానికి తిండిలేక అవస్థలు పడింది. అయినా కొడుకు మీద మమకారంతో రాత్రి, పగలు, ఎండ, ఆకలి వంటి ఇబ్బందులను లెక్క చేయకుండా నెల్లూరు జిల్లా రెహ్మతాబాద్‌లోని తన కుమారుడి దగ్గరకు చేరుకుంది. అతడితో కలిసి తిరిగి బోధన్ చేరుకుంది. మూడు రోజుల్లో స్కూటీపై 1400 కిలోమీటర్లు ప్రయాణించింది. కన్నపేగు బంధాన్ని ఆపలేకపోయిన మహిళ రాను 700 కి.మీ. పోను 700 కిలోమీటర్లు అలా మొత్తం 14వందల కీలోమీటర్ల దూరంలో ఉన్న కుమారుడిని చెంతకు చేరింది.
పిల్లాడి కన్నా తనకేది ముఖ్యం కాదని రజియా చెప్పుకుంది. తన ప్రయాణానికి సహకరించిన ఇరు రాష్ట్రాల పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. తాను పడిన కష్టం తనకు లెక్క కాదని తన కుమారుడిని తిరిగి తన దగ్గరకు తీసుకురావడం తనకు సంతృప్తి కలిగించిందని ఆమె తెలిపింది.
కన్న కొడుకును చూడాలనే తపనతో లాక్ డౌన్ ను లెక్కచేయలేదు ఆ తల్లి. ఒంటరిగానే తన స్కూటీ పై సుమారు 1400 వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అష్టకష్టాలు పడి తన కొడుకు వద్దకు చేరి తల్లి ప్రేమకు సాటిలేదని నిరూపించుకున్న మహిళలను పలువురు అభినందిస్తున్నారు. అవిశ్రాంతంగా ప్రయాణించిన ఆమె ధైర్యాన్ని స్థానికులు ప్రశంసించారు.