New Year 2024: పార్టీ మూడ్‌లోకి వెళ్లిన యువత.. 2024కి గ్రాండ్‌గా వెల్‌కమ్
New Year 2024: అర్థరాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఇచ్చిన పోలీసులు
New Year 2024: మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2023కి గుడ్ బై చెప్పి.. 2024కి ఘన స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమైంది. భవిష్యత్తుపై కొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు గెట్ రెడీ అంటోంది యూత్. ఏడాది మొత్తం గుర్తుండేలా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమయ్యారు. ఆనందోత్సవాల మధ్య కేరింతలతో 2024కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఎవరికి వారు ప్లాన్స్ వేసుకున్నారు. పట్నం, పల్లె అని తేడా లేకుండా.. అంతా పార్టీ మూడ్‌లోకి వెల్లిపోయారు. నా భూతో న భవిష్యతి అనేలా సెలబ్రేషన్స్‌తో హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది.
సెలబ్రేషన్స్ అంటే.. అలా ఇలా ఉండొద్దు. 2024 మొత్తం స్వీట్ మెమోరిస్‌లా మిగిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేషన్స్‌కు రెడీ అయ్యారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్ హౌస్‌లు, రిసార్టులు బుక్ చేస్తున్నారు. అమ్యూజ్‌మెంట్ పార్కులు, క్లబ్‌లు, స్టార్ హోటల్స్, కన్వెన్షన్లలో సెలబ్రేషన్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రముఖులు, వ్యాపార వర్గాలు గోవాలో, విదేశాల్లో న్యూ ఇయర్ పార్టీలకు తరలివెళ్లారు.
న్యూ ఇయర్ వేడుకలతో హైదరాబాద్‌లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ ప్రియులను ఆకట్టుకునేందుకు, వారిని సంబురాల్లో ముంచేందుకు అదిరిపోయే రేంజ్‌లో ఈవెంట్స్ రెడీ అయ్యాయి. పబ్‌లు, క్లబ్, రిసార్టు..ప్రత్యేక ఆకర్షణగా మారాయి. డీకే మోతలు, మందు, విందుతో కస్టమర్స్‌ను ఫుల్ కుష్ చేసేందుకు రెడీ అయ్యాయి. ప్రత్యేక ఆకర్షణగా తారలను, డీజేలను వేడుకలకు ఇన్వైట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త థీమ్‌లతో నిర్వహిస్తుంటారు.
మైదానాల్లో విద్యుత్తు ధగధగల నడుమ లైవ్ మ్యూజిక్, దేశ, విదేశాల నుంచి రప్పించిన డీజేల సంగీత హోరులో సెలబ్రేషన్స్ నిర్వహణ మొదలు ఇండోర్‌లో పార్టీల వరకు వేర్వేరు థీమ్‌లతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్, బాలీవుడ్, టాలీవుడ్ సంగీతంతో వేడుకలకు వచ్చిన వారిని 5-6 గంటలపాటు అలరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూ ఇయర్ కోసం మస్త్ మస్త్ పార్టీ చేసుకునేందుకు హోటళ్లు, క్లబ్బులు ఇప్పుడు కాస్త ఓల్డ్ ట్రెండే! ఫామ్ హౌస్‌లు, రిసార్ట్‌లే నయా ట్రెండ్! నగరానికి దూరంగా మద్యం మజాలో డీజేల హోరు.. డ్యాన్సులు, కేకల మధ్య ఆనందంపుటంచులను తాకితే అదే అసలైన పార్టీ అని.. అడిగేవారు, అడ్డు చెప్పేవారూ ఉండరనే భావనతో పార్టీ ప్రియులు ఫామ్‌హౌ్‌సలకు వెళ్లేందకు ప్రాధాన్యమిస్తున్నారు. నలుగురు నుంచి పదిమంది దాకా పోగై కొందరు.. కుటుంబసభ్యులతో ఇంకొందరు ఫామ్‌హౌ్‌సలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు నగర శివార్లలో ఉన్నవాటిని బుక్ చేసుకుంటున్నారు.
న్యూ ఇయర్ వేడుకల కోసం మొయినాబాద్, చిలుకూరు బాలాజీ రోడ్, జల్‌పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, వికారాబాద్, గండిపేట తదితర ప్రాంతాల్లోని ఫామ్‌హౌ్‌సలకు డిమాండ్ పెరిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గతంతో పోలిస్తే 20-30 అధిక రేట్లను నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు వినికిడి. ఖర్చును పార్టీ ప్రియులు అస్సలు పట్టించుకోవడం లేదు. న్యూ ఇయర్ మజా కోసం ఎంతైనా చెల్లించేందుకు రెడీ అయిపోయారు. ఫ్యామిలీలు కూడా ఫామ్‌హౌస్‌లకు చేరుతున్నాయి. నాలుగైదు కుటుంబాలు కలిసి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
సాధారణంగా న్యూ ఇయర్ పార్టీలు అనగానే పోలీసుల ఆంక్షలుంటాయి. ఆ రోజు రాత్రంతా తనిఖీలుంటాయి. ఈ తలనొప్పులెందుకని చాలా మంది ఏ గోవాకో.. దుబాయ్‌కో వెళ్లి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ ధోరణి మారుతోంది. ఇప్పటికే కిట్టీ పార్టీలంటూ వీకెండ్స్‌లో ఫామ్ హౌస్‌లకు వెళ్లి మజా చేస్తున్న పార్టీ ప్రియులు.. న్యూ ఇయర్ వేడుకలకూ అవే బెటర్ అంటున్నారు. ఫలితంగా శివార్లలోని ఫామ్‌హౌ్‌సలు, రిసార్ట్‌లు దాదాపుగా ఫుల్ అయిపోయాయి.
ఐతే న్యూ ఇయర్ వేడుకల పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే.. కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పోలీస్ మామలు హెచ్చరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించేవారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్స్ పరిధిలో చెక్‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్‌లు చేపట్టాలని నిర్ణయించారు.
మద్యం సేవించి పట్టుబడినవారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడితే కఠినచర్యలు తీసుకోవాలని, మైనర్స్ డ్రైవింగ్ పై దృష్టి సారించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్‌పాయింట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఆల్కాహాల్ కంటెంట్‌ని బట్టి చర్యలు తీసుకోనున్నారు. 10 వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మూడు కమిషనరేట్లలో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇవ్వల రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు.
ఇక ఓఆర్‌ఆర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఇస్తారు. నగరంలోని లంగర్‌హౌస్, బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్స్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. పోలీసుల ఆంక్షలు, సూచనలు పాటిస్తూ ప్రజలందరూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని పోలీస్ బాస్ లు సూచిస్తున్నారు.