మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్
Ex MLA Shakeel Son: ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ex MLA Shakeel Son: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. సోహెల్‌ను యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేసిన బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకున్నారు. మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టాడు షకీల్ కుమారుడు సోహెల్. ఈ కేసును తప్పించుకునేందుకు అతని స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్ పారిపోయాడు సోహెల్. ఇవాళ నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట ఇద్దరిని హాజరుపర్చనున్నారు పంజాగుట్ట పోలీసులు.
డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద రాత్రి అతివేగంతో వెళ్తూ ఓ బీఎండబ్ల్యూ కారు బారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌దని గుర్తించారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్ కేసు నమోదు అయింది.