TS Inter 1st Year: ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్‌ షెడ్యూల్‌.. వారికి మేలు చేసేలా

TS Inter 1st Year: కార్పొరేట్ కాలేజీలకు మేలు చేసేలా షెడ్యూల్‌ ఉందని ఆరోపణ

Update: 2021-05-28 09:23 GMT

ఇంటర్ స్టూడెంట్స్ అడ్మషన్ (ఫోటో ది హన్స్ ఇండియా )

TS Inter 1st Year: కరోనాతో ఇంత కాలం మూత పడ్డ విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నామని చెబుతున్నా.... కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి.

తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి జులై 5 వరకు తొలి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నారు. అయితే ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ మాత్రమేనని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల ఇంటర్నెట్‌ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఇప్పటికే అయా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఎస్ఎస్‌సీ ఒరిజినల్‌ మెమోలు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్‌ అడ్మిషన్లను ఆమోదించనున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేయాలన్న డిమాండ్ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి రాలేదు. కానీ ఇంటర్ బోర్డు మాత్రం ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. ఇప్పటికే పలు కార్పొరేట్ కాలేజీలు ప్రవేశాలను చేపట్టాయి. ఆ అడ్మిషన్లకు చట్టబద్ధత కల్పించడం కోసమే ఈ షెడ్యూల్ విడుదల చేసినట్టుగా ఉందని విద్యార్థి, అధ్యాపక సంఘాలు విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రైవేట్‌ కాలేజీల నుంచి వచ్చే విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఆలస్య రుసుంతో జులై ఐదు వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముంది. ఆ ప్రక్రియ ముగియనే లేదు. రాష్ట్రంలో ప్రయివేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఇంకా చేపట్టలేదు. 2020-21 విద్యాసంవత్సరంలో 1,701 ప్రయివేటు జూనియర్ కాలేజీలుంటే ఇంటర్ బోర్డు 1,486 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరానికి ఎన్ని కాలేజీలు దరఖాస్తు చేశాయో తెలియదు.

ఏ కాలేజీ అన్ని నిబంధనలూ పాటించిందో ప్రశ్నార్థకమే. చాలా కాలేజీ యాజమాన్యాలకు లాక్డౌన్ సమయంలో ఇంటర్ బోర్డు అడిగిన పత్రాలు తేవడం ఇబ్బందిగా మారింది. ఇక ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. ఈ నేపథ్యంలో విడుదలైన ఇంటర్‌ ఆడ్మిషన్ల షెడ్యూల్‌తో విద్యార్థులు తల్లిదండ్రులు, కాలేజీ యజమానులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కొందర అంటున్నారు.

Tags:    

Similar News