Top 6 News Of The Day: ఎయిర్ పోర్టులో కవితకు గ్రాండ్ వెల్‌కమ్.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Update: 2024-08-28 12:45 GMT

1) హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కవిత.. BRS సందడే సందడి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఐదున్నర నెలల తరువాత హైదరాబాద్ వచ్చిన కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కవిత ఎయిర్ పోర్టు నుండి బయటికి వస్తూనే జై తెలంగాణ నినాదాలు చేశారు. కవిత రాక సందర్భంగా అక్కడికి వచ్చిన భారీ సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఎయిర్ పోర్ట్ అరైవల్స్ ప్రాంగణం అంతా నిండిపోయింది. కవితకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలు మహిళా నేతలు అక్కడికి తరలివచ్చారు. ముందుగా కవితను కలిసి స్వాగతం చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పోటీపడటం కనిపించింది. ఎయిర్ పోర్టు నుండి ఆమె నేరుగా తన నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వెంట కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమార్, హరీష్ రావు, కుమారుడు ఉన్నారు.

2) కేబినెట్ భేటీలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. తెలంగాణకు 1, ఆంధ్రాకు 2

ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్ర కేటినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం 25 వేల కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ల ద్వారా 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో, కడప జిల్లా కొప్పర్తిలో ఈ పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2,786 కోట్ల వ్యయంతో 2వేల 621 ఎకరాల్లో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్, 2వేల 137 కోట్లతో 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలోని జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాను కూడా అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

3) ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యాంశాలు

ఏపీ కేబినెట్‌‌ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాస్‌ పుస్తకాలపై, సర్వేరాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 22A, ఫ్రీహోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు, వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణను ఆమోదించిన మంత్రివర్గం.. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది.

4) హైడ్రాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

హైడ్రా దూకుడుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్‌ పరిధిలో చెరువులను కబ్జా చేసిన ఎవర్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్ళ నిర్మాణాలనూ హైడ్రా కూల్చివేసిందని, మొదటగా తమ పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్‌హౌజ్‌నే కూల్చారన్నారు. ORR బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని, ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అవుతుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో తన కుటుంబ సభ్యుల నిర్మాణాలు ఉంటే వివరాలు ఇవ్వండి తానే వచ్చి దగ్గర ఉండి కూల్చివేయిస్తా ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు సైతం బఫర్ జోన్‌లో ఫామ్ హౌజ్‌లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

5) ఇక చాలు.. కోల్‌కతా ఘటనపై ద్రౌపది ముర్ము ఆందోళన

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని, తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజమూ అనుమతించదని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.

6) సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి

సెక్రటేరియెట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో కీలక ఘట్టమైన భూమిపూజ కార్యక్రమం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. సెక్రటేరియట్ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్ కి దగ్గరలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కానుంది. అతి త్వరగా పనులు పూర్తి చేసి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News