గ్రేటర్ ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న టీ కాంగ్రెస్

Update: 2020-08-18 07:30 GMT

Telangana congress gears up for Greater Hyderabad elections: ఓ వైపు పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచుతూనే ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వచ్చే గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కారును ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళిక, ఖచ్చితమైన వ్యూహం ఉండాలని నిర్ణయించింది. మరోవైపు సచివాలయంలో మందిర్, మసీద్‌ కూల్చివేతలను ప్రచారాస్త్రంగా మలుచుకోబోతుంది హస్తం పార్టీ. తెలంగాణ హస్తం పార్టీ గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని పార్టీ శ్రేణులను ముందస్తుగానే సమాయత్తం చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగా ఆదివారం గాంధీ భవన్ లో గ్రేటర్ నాయకులతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ , ఖమ్మం , వరంగల్ లో జరిగే గ్రేటర్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుందన్నారు పీసీసీ ఛీప్ ఉత్తమ్. దీనిపై గ్రేటర్ లో సీనియర్ నాయకులతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 24 లోపు డివిజన్ల వారిగా కమిటీలు వేసి సమాయత్తం కావాలన్నారు. అర్హులైన ఒక్క శాతం మంది పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చినా బల్దియా ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని సవాల్‌ విసిరారు. సచివాలయంలో మసీదు , ఆలయం కూల్చివేతపై న్యాయపోరాటం చేస్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ప్రభుత్వం మసీదు కులుస్తుంటే ఒవైసీ బ్రదర్స్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మసీదు, మందిర్ కూల్చివేతకు వ్యతిరేకంగా ఈనెల 22న ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలోని ఆలయం, మసీదు కూల్చివేత విషయాన్ని గ్రేటర్ ఎన్నికల్లో జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితమైన వ్యూహం, సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు.

Tags:    

Similar News