తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఆ ఇద్దరు ఎంపీలు?

Update: 2020-02-14 07:02 GMT
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఆ ఇద్దరు ఎంపీలు?

తెలంగాణ బీజేపీకి కొత్త కెప్టెన్‌ ఖాయమా? సీనియర్లను పక్కనపెట్టి యంగ్‌ కెప్టెన్‌ను నియమించడం కన్‌ఫామా? పార్లమెంట్ పోరులో అదిరిపోయే విజయాలు సాధించి, ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళనతో చెలరేగిపోతున్న , ఆ ఇద్దరిపై కాషాయ అధిష్టానం దృష్టిపెట్టిందా? ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి స్టేట్ బీజేపీ న్యూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతోందా? రేపోమాపో కొత్త టీం అనౌన్స్‌మెంట్‌ జరగబోతోందా? ఇంతకీ ఎవరా యంగ్‌ ప్లేయర్స్? ఇరువురిలో ఎవరికి ఛాన్స్?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఖాయమా? మార్పు ఖాయమైతే, కొత్త ప్రెసిడెంట్‌ ఎవరు?

తెలంగాణ బీజేపీలో కొన్ని నెలల నుంచి ఇదే చర్చ వాడివేడిగా సాగుతోంది. స్టేట్ లీడర్‌షిఫ్‌ చేంజ్ కన్‌ఫామ్ అంటూ సిగ్నల్స్ ఇస్తున్న, కమల అధిష్టానం, ఆ నాయకుడు ఎవరన్నది మాత్రం క్లూ ఇవ్వడం లేదు. అదే ఇప్పుడు రాష్ట్ర కాషాయదళంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

తెలంగాణ బిజేపి అధ్యక్షపదవి మార్పుకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌ పదవి కాలం ముగుస్తోంది. నూతన అద్యక్షుని ఎంపికపై జాతీయపార్టీ దృష్టిపెట్టినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు మాత్రమే పార్టీ పరిమితమైందనే విమర్శలున్నాయి. ఈ అభిప్రాయాన్ని మార్చాలనుకుంటోందట హైకమాండ్. ఇదే నిజమైతే, కొత్త అధ్యక్షుడు ఖామయన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పటికే పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. పార్టీ అధ్యక్ష పదవి కూడా హైదరాబాద్‌కే చెందిన లక్ష్మణ్‌కు ఉన్నందున, ఆయన పదవిని మార్చవచ్చనే చర్చ సాగుతోంది. సీనియర్లంతా లక్ష్మణ్‌ను మరోసారి కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నా, పార్టీలో రెండు ముఖ్యపదవులు హైదరాబాద్ చెందిన వారికే కేటాయిస్తే జిల్లాల్లో పార్టీ నష్టపోతుందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.

హైదరాబాదేతర నాయకునికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా వుంటుందన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడినందున పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్, లేదా ధర్మపురి అర్వింద్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను జాతీయపార్టీకి సంఘం పంపిన్నట్లు సమచారం. ఇప్పటికే రాష్ట్ర్ర పార్టీ నేతలకంటే పార్లమెంటు ఎంపీలే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో ముందుండటంతో, వారితోనే టిఆర్ఎస్‌ను ఢీకొట్టించడానికి జాతీయపార్టీ సైతం ఆలోచిస్తోందట.

భైంసా ఘటనలో బండి సంజయ్, ఇళ్ల కేటాయింపుపై ధర్మపురి అర్వింద్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. డబుల్ బెడ్ రూంల కోసం కేటాయించిన నిధులపై ఇప్పటికే పార్లమెంటులో ధర్మపురి అర్వింద్ లెక్కలతో సహా వివరించారు. దీనిపై మహిళలతో కలిసి ఉద్యమించడానికి సిద్దమవుతున్నారట అర్వింద్. భైంసా ఘటనపై బండి సంజయ్ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ రెండు అంశాల్లో కూడా రాష్ట్ర పార్టీ సీనియర్లు అంతగా స్పందించలేదన్న విమర్శ ఉంది.

పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎదగడానికి అవకాశమున్న తెలంగాణలో, దూకుడుగా వుండే లీడర్‌కే పగ్గాలు అప్పగిస్తే, క్షేత్రస్థాయిలో, శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని భావిస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అవి ఇఫ్పుడే బయటపెడితే, పార్టీలో అసమ్మతి రేగే అవకాశముందని వెనకాముందు ఆడుతోందట అధిష్టానం.

మరోవైపు కొత్తవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పగ్గాలు వెళ్లకుండా, సీనియర్లు గట్టిగానే అడ్డుపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. అందుకే కొత్త అధ్యక్షుడి ఎంపిక బీజేపీ హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారింది. చూడాలి, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, కొత్త అధ్యక్షుడిగా ఎవరొస్తారో, ఎందుకు అనవసరమైన గొడవా అని, పాత ప్రెసిడెంట్‌నే హైకమాండ్‌ కంటిన్యూ చేస్తుందో.


Full View


Tags:    

Similar News