Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly: ఉ.10 గం.కు కులగణన తీర్మానం ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ఉదయం పది గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇరిగేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది సర్కార్. అటు ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో వివరించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం, శ్వేతపత్రంపై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది.
అయితే గురువారమే సభలో కుల గణన తీర్మానం ప్రవేశపెట్టాలని సర్కార్ భావించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే కుల గణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
మరో నీటిపారుదలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అయిన కాంగ్రెస్ సర్కార్‌పై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురుదాడికి సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో వాటర్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. కేఆర్‌ఎంబీ నీటి వాటాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ శ్వేతపత్రంపై జరిగే చర్చ మరింత పొలిటికల్ హీట్‌ను పెంచే అవకాశం ఉంది. గురువారం జరిగిన సభలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్టులో పలు లోపాలను ఎత్తి చూపెట్టింది కాంగ్రెస్.