TG Assembly Sessions: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
TG Assembly Sessions: ఈ నెల 25న ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్
TG Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. 23 నుంచి శాసనసభ, 24 నుంచి మండలి సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి రోజున కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ సంతాపం తెలపనుంది. కేంద్రం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్‌లు, ఇతర నిధుల్ని పరిశీలించి తెలంగాణ బడ్జెట్‌కు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్.. సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వనుంది.
నాలుగు నెలల కోసం ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదించిన 2 లక్షల 75 వేల కోట్ల ఓటాన్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. సుమారు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. బడ్జెట్‌తోపాటు, ధరణి, రైతు భరోసా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారినుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.