TS Polling: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌

TS Polling: 119 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తు్న్న ఎన్నికల సిబ్బంది

Update: 2023-11-30 01:52 GMT

TS Polling: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌

TS Polling: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలింగ్‌ ఏజెంట్లు సమక్షంలోనే ఈ మాక్ పోలింగ్‌ను ఎన్నికల అధికారులు జరిపారు. తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35వేల 655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఇందులో 27వేల 94 కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒకేచోట ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఉన్న 7వేల 571 చోట్ల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 12 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాలను 3వేల 806 సెక్టార్‌లుగా విభజించామని, పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా, ఇతర సమస్యలున్నా సెక్టార్‌ అధికారులు పరిష్కరించనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 2వేల 290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 221 మహిళలు, 2వేల 068 మంది పురుషులు, ఒక ట్రాన్స్‌ జెండర్ బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 26 లక్షల 2 వేల 799 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418కాగా.. మహిళా ఓటర్లు కోటి 63 లక్షలా 17 వందలా ఐదు మంది ఉన్నారు. 2వేల 676 మంది ట్రాన్స్ జెండర్ల్ ఓటర్లు కూడా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోబోమని, ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొనిరావాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్లకు సూచించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పుపై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఏవీ ఉండకూడదని, తెల్లకాగితంపై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈవీఎంల దగ్గరికి పోలింగ్‌ ఏజెంట్లు వెళ్లవద్దని, ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోకి ఫోన్‌ తీసుకొనిరావద్దని సూచించారు. ఓటింగ్‌ రహస్యంగా వేయాల్సి ఉంటుందని, ఓటును ఫొటో తీయడానికి కూడా వీలులేదని తెలిపింది. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో 94% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

సాయంత్రం ఐదు వరకు పోలింగ్ వుంటుంది. సమస్యాత్మక ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా 106 సెగ్మెంట్లలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తులో 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలు, 50వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News