Telangana: విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం
Telangana: 26 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు * 3రోజుల ఏసీబీ సోదాల్లో వెలుగు చూసిన అవినీతి
Telangana: అవినీతి అక్రమాలతో దుర్గగుడి మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతలున్న ఇంద్రకీలాద్రిలో అక్రమాల పుట్ట బట్టబయలవడం ప్రకంపనలు రేపుతోంది. ఇంతకీ దుర్గగుడిలో అసలు ఏం జరిగింది..? ఏసీబీ నివేదిక ఏం తేల్చింది?
ఇదీ అదీ అని తేడా లేదు.. అన్ని విభాగాల్లో చేతివాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకుని డబ్బులన్నీ పక్కదారి పట్టించారు. చీరల నుంచి భూముల దాకా.. టికెట్లు, అన్నదానం నుంచి స్టోర్ల దాకా అన్నింటా అక్రమాలే. చీరలు, టికెట్ల విక్రయాలు స్టోర్లు, ప్రసాదాల పంపిణీ ఇలా దుర్గమ్మ ఆలయం చాటున ఆదాయానికి గండి కొడుతూ వచ్చారు అక్రమార్కులు.
ఇంద్రకీలాద్రిపై అవినీతి రాజ్యమేలుతోంది. మూడు రోజుల పాటు ఏసీబీ జరిపిన సోదాల్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అన్ని విభాగాల్లో సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించింది ఏసీబీ. శానిటైజేషన్ కాంట్రాక్టులు, సెక్యూరిటీ సిబ్బంది టెండర్లు, స్టోర్స్ లో సరుకుల కొనుగోళ్లు, అమ్మవారి చీరలు అమ్మకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఏసీబీ తేల్చింది.
ఇక గుడిలో సోదాల తర్వాత అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఏసీబీ. నివేదిక అంది 24 గంటలు గడవకముందే చర్యలకు ఉపక్రమించిన ఏపీ ప్రభుత్వం.. 26 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఆరుగురు సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో పాటు 15 మంది ఇతర స్థాయి సిబ్బందిపై వేటు వేసింది.
పరిపాలన విభాగం సూపరింటెండెంట్ రవి ప్రసాద్, అన్నదానం, స్టోర్స్, హౌస్ కీపింగ్ విభాగాల సూపరింటెండెంట్లతో పాటు.. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాల సూపరింటెండెంట్.. కొండపై వివిధ రకాల కౌంటర్ల సూపరింటెండెంట్లను సస్పెండ్ చేసింది దేవాదాయ శాఖ. దర్శన టికెట్ల అమ్మకం కౌంటర్‌లో పనిచేసే ముగ్గురితో పాటు ప్రసాదాల పంపిణీ, అమ్మవారి చీరలు భద్రపరిచే విభాగం, ఫొటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బంది కూడా సస్పెండ్ అయ్యారు.
మరోవైపు అవినీతి వ్యవహారమంతా ఈవో సురేశ్‌బాబు చుట్టే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సురేశ్‌బాబుపై దేవాదాయ శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇవాళ మరికొంత మందిపై వేటు పడే అవకాశాలున్నాయి. దీంతో లిస్ట్‌లో ఎవరున్నారనే టెన్షన్ మొదలైంది ఉద్యోగుల్లో. కానీ ఇందులో ఎంతమందిపై వేటు పడుతుంది...? ఈ అక్రమాలకు తావిచ్చిన అనకొండలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.