Supreme Court: గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

Supreme Court: గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియరైంది. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Update: 2024-10-21 07:37 GMT

Supreme Court: గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియరైంది. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29 ని రద్దు చేయాలని కొందరు అభ్యర్ధులు ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అక్టోబర్ 21న సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్ తరపు న్యాయవాదులు కోరారు. పరీక్షలు రాసే సమయంలో తాము ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునకు కట్టుబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. 2022 లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన 55 జీవోను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. 500 పోస్టులకు మరో 53 పోస్టులను జోడించింది. 29 జీవోను తెచ్చింది. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్ధులు వాదిస్తున్నారు. దీంతోనే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ లలో చుక్కెదురైంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ సమయంలో జోక్యం చేసుకునేందుకు అంగీకరించలేదు.

గ్రూప-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో జీవో 55, 29 ల అంశం తెరమీదికి వచ్చింది. జీవో 29ని రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్ధులు ఆందోళనలు నిర్వహించారు.ఈ విషయమై కోర్టులను ఆశ్రయించారు. అభ్యర్ధుల ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. జీవో 29 తో గ్రూప్-1 అభ్యర్ధులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వం హామీ ఇస్తోంది. రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 19న ప్రకటించారు.

గ్రూప్-1 పరీక్షలు: జీవో 55, జీవో 29కి తేడా ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది?

గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టులో కొందరు అభ్యర్ధులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే పరీక్షలు వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. మరికొందరు అక్టోబర్ 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నాడు ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించనుంది.

గ్రూప్-1 అభ్యర్ధుల డిమాండ్ ఏంటి?

563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమయంలో 55 జీవోను రద్దు చేసి 29 జీవోను విడుదల చేసింది. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్ లో మెరిట్ ప్రకారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల కేటాయింపుల్లోనే రిజర్వేషన్ అమలు చేస్తారు. దీనివల్ల ఓపెన్ కేటగిరిలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్ధులకు కూడా రిజర్వేషన్ కేటగిరి కిందనే పరిగణించే అవకాశం ఉంది. ఇది రిజర్వ్ డ్ కేటగిరిలోని అభ్యర్ధులకు అన్యాయం చేస్తోందని గ్రూప్-1 అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవోతో 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్ధుల్లో 100 పోస్టులకు 5 వేల మంది పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నారు. సాధారణంగా 5 వేల మందిలో 2500 మంది రిజర్వ్ డ్ , మిగిలిన 2500 మంది ఓపెన్ కేటగిరిలో మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల ఎంపికలో రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలను అభ్యర్ధులు వ్యతిరేకిస్తున్నారు.

జీవో 55 ఏం చెబుతోంది?

గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2022లో జీవో 55 ను తీసుకువచ్చింది. దీని ప్రకారంగా 40 శాతం అభ్యర్ధులను మెరిట్ ప్రకారంగా ఎంపిక చేస్తారు. మిగిలిన 60 శాతం అభ్యర్ధుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. రిజర్వ్ డ్ అభ్యర్ధులు ఓపెన్ కోటాలో ఎంపిక అవుతారు. ఈ జీవో ప్రకారంగా మెరిట్ తక్కువగా ఉన్న అభ్యర్ధులకు రిజర్వ్ డ్ కేటగిరిలో అవకాశం దక్కుతోందని గ్రూప్-1 అభ్యర్ధులు చెబుతున్నారు.

ఇప్పుడు 29 జీవోను రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్ధులు కోరుతున్నారు. ఈ జీవో ప్రకారంగా తమకు నష్టం జరుగుతుందని అభ్యర్ధులు చేస్తున్న వాదనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వం చెబుతోంది. అయినా కొందరు అభ్యర్థులు జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించారు.

Tags:    

Similar News