నిన్నటిదాక కింగ్ లా ఉన్నారు. నేతలను, క్యాడర్ ను చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. కాని ఉండలేక, ఓపికలేక పార్టీలు మారిపోయారు. ఇంకేం, లాస్ట్ కం లాస్ట్ బెంచ్‌కు పరిమితమయ్యారు. నియోజకవర్గాల్లో కింగ్‌లా ఉండే, ఆ లీడర్లనిప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. చెప్పిందే మాటగా నడిపించుకున్న నేతలకు ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో కక్కలేక మింగలేక ఉంటున్నారట. పాత పార్టీకి మళ్లీ పోలేక కొత్త పార్టీలో ఉండలేక నలుగుతున్న ఆ ప్రజాప్రతినిదులకు సైలెంటే సమాధానమట. ఇంతకీ ఆ సైలెంట్ ఎన్నాళ్లు సహనానికి స్వీయ పరీక్ష పెట్టుకుంటున్న ఆ నేతలెవ్వరు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే విలక్షణ రాజకీయానికి పెట్టింది పేరు చాలామంది నాయకులు జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎదిగారు. అలాంటి చైతన్యం ఉన్న కరీంనగర్‌లో ప్రతి నియోజకర్గంలోను ఒక్కో నేత, ఒక్కో స్టైల్ తో రాజకీయం చేసేవారు. అలానే ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అలాంటి నాయకుల జాబితాలో ఉన్న ఇద్దరు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆ ఇద్దరు రాజకీయ నాయకులు పవర్‌లో ఉన్నప్పుడు రాజకీయంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్న వాళ్లే.
అందులో ఒకరు ఆరపెల్లి మోహన్. మానకొండూరు నియోజకర్గం నుంచి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు మోహన్. అంతకు ముందు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. కరీంనగర్ కాంగ్రెస్‌లో ఆరెపల్లి మోహన్ ది ఓ ప్రత్యేక రాజ్యాంగం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, నమ్ముకున్న క్యాడర్‌ను నట్టేట వదిలి, 2019 లో గులాబీ కండువా కప్పుకున్నారు ఆరెపల్లి మోహన్. వచ్చే 2023 ఎన్నికల్లో మానకొండూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయిని కాదని అసెంబ్లీ టికెట్ ఇస్తారా, లేక గతంలో నష్ట పోయినందుకు తామున్నామని భరోసా ఇచ్చారో లేదో తెలియదు కాని, ఫుల్లీ లోడెడ్ కారులో స్టాండ్ బై ఎక్కేసారు మోహన్.
అయితే కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం అధికార పార్టీపై ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాస్త వార్తల్లో ఉన్న మోహన్, ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విప్ గా, జిల్లాతో పాటు తన నియోజకవర్గంలోనూ కీలకంగా వ్యవహరించారు ఆరెపల్లి మోహన్. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, తన ఉనికి మాత్రం కనపడటం లేదు. మోహనన్న నాటి రోజులు ఏమాయే అని క్యాడర్ అడుగుతుంటే, సమాధానం చెప్పలేక కామ్ గా ఉంటున్నారట. పోనీ జనంలో ఉండాలటే అదే గులాబీ పార్టీ నుంచి చురుకుగా తిరుగుతున్నారా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి తన నీడను సైతం ఆరెపల్లిని తాకనియ్యడం లేదట. పాపం మోహన్, పెనం నుంచి పొయ్యిలో పడ్డారన్న హాట్ కామెంట్స్ తన ఇంటి నుంచే వస్తున్నాయట. చూద్దాం వెయిట్ అండ్ సీ పాలసీ మోహన్‌కు ఎలా పనికి వస్తుందో
ఇదే కరీంనగర్ జిల్లాలో మరోనేత చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలో మొదటి నుండి బొడిగె శోభ రాజకీయాల్లో సంచలనమే. నోరు విప్పితే కంచు కంఠమే. తెలంగాణ ఉద్యమ ఆద్యంతం గులాబీ వనంలోనే ఉన్నారు. అప్పట్లో గులాబీ పార్టీ నుంచి ఎవ్వరైనా మాట్లాడితే, బొడిగే శోభనే గుచ్చుకునేంత విమర్శల దాడి చేసేవారు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌ను కరీంనగర్ వద్ద అరెస్ట్ చేస్తే, కారంపొడి ముద్దలతో ధర్నాలు చేశారు. ఫలితంగా 2014లో గుర్తించి శోభను ఎమ్మెల్యే చేశారు కేసిఆర్. ఫైరింగ్ మాటలతో గుర్తింపు తెచ్చుకున్న బొడిగే శోభకు, టిఆర్ఎస్‌లో అదే మైనస్‌గా మారింది.
ఓపిక, సంయమనం లేని ఫలితానికి తోడు, అదే పనిగా నోటికి పని చెప్పడంతో, 2018 ఎన్నికల్లో టికెట్ కు దూరమయ్యారు శోభ. దీంతో బిజేపిలోకి వెళ్లి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొంత దూకుడుగా కనిపించిన శోభ, మళ్లీ అంతగా యాక్టివ్‌గా కనపడటం లేదట. బొడిగె శోభ సన్నిహితులు మరణించడంతో పాటు, రకరకాల కారణాలతో పాలిటిక్స్‌లో ఈ మధ్య క్రియాశీలకంగా ఉండలేకపోతున్నారని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. తొలిసారి అధ్యక్షా అంటూ ప్రమాణ స్వీకారంలో తడబడిన శోభ, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని, తనలాంటి సామాన్యులెందరికో స్ఫూర్తిగా నిలవడంలోనూ తడబడ్డారు.
వీళ్లిద్దరు...పవర్‌లో ఉండగా చాలా దూకుడుగా తమ నియోజకవర్గంలో పాలిటిక్స్ చేశారు. అయితే ఇందులో ఆరెపల్లి మోహన్ అధికార పార్టీలో ఉన్నప్పటికీ, ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండక తప్పడం లేదట. దళిత నేతలుగా నియోజకవర్గంలో మంచి పేరుతెచ్చుకున్న ఈ ఇద్దరు, యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఏదైనా, సొంత నియోజకవర్గంలో ఉనికిని చాటుకోలేకపోతున్నారట. అయితే వీళ్లని నమ్మకున్న కార్యకర్తలు, అనుచరుల పరిస్థితి కూడా ఇలానే ఉందట. అంతా యాక్టివ్‌గా ఉంటే, వీళ్ల అనుచరులు మాత్రం యథా నేత..తథా అనుచర..అంటూ సైలెంట్ గానే ఉంటున్నారట. కానీ రాజకీయాన్ని గమనిస్తూ, వ్యూహత్మకంగా వెళ్తున్నారా లేక కావాలనే సైలెంట్‌గా ఉంటున్నారా అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదట ఈ నాయకుల వ్యవహారం.