Formula -E Car Race Case కీలక పరిణామం: ఈడీకి డాక్యుమెంట్లు ఇచ్చిన ఏసీబీ
ఫార్ములా ఈ కారు రేసు కేసుకు(Formula -E Car Race) సంబంధించిన వివరాలను ఈడీ (Enforcement Directorate) అధికారులకు శనివారం ఏసీబీ (ACB) అందించింది.
ఫార్ములా ఈ కారు రేసు కేసుకు(Formula -E Car Race) సంబంధించిన వివరాలను ఈడీ (Enforcement Directorate) అధికారులకు శనివారం ఏసీబీ (ACB) అందించింది. హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు, ఎఫ్ఈఓతో హెచ్ఎండీఏ ఒప్పందాలు, ఈ కేసులో సంబంధం ఉన్న డాక్యుమెంట్లను అందించారు. ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు.
ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో ఈడీ డిసెంబర్ 20న కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ (KTR), అరవింద్ కుమార్ (Arvind Kumar), బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. 2025 జనవరి 2న అరవింద్ కుమార్, జనవరి 3న బీఎల్ఎన్ రెడ్డి, జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనలను ఉల్లంఘించారని ఈ నెల 19న కేటీఆర్ , అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని డిసెంబర్ 27న హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ కు బెయిలిచ్చినా, అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు కొనసాగించినా విచారణకు ఇబ్బందులు ఉంటాయని ఏసీబీ ఆ పిటిషన్ లో తెలిపింది.
విధాన నిర్ణయాల్లో అధికారులదే బాధ్యత: ఏసీబీకి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ కు కేటీఆర్ కౌంటర్ దాఖలు చేశారు. విధాన పరమైన నిర్ణయాల్లో అధికారులదే బాధ్యత అని ఆయన చెప్పారు. విదేశీ సంస్థకు నిధుల బదిలీ, అనుమతులు, ఇతర అంశాలను అధికారులు చూసుకోవాలన్నారు. మంత్రిగా అది తన బాధ్యత కాదని ఆయన ఆ అఫిడవిట్ లో చెప్పారు. హెచ్ఎండీఏ చట్టబద్దమైన సంస్థ, ఫార్మూలా-ఈ కారుకు ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు , నిధుల బదలాయింపు విషయాలను సంబంధిత అధికారులు చూసుకోవాలని ఆయన వివరించారు. రూ. 10 కోట్లకు మించి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన హెచ్ఎండీలో ఎక్కడా లేదని ఆయన అన్నారు.
నిబంధనలకు విరుద్దంగా నిధుల చెల్లింపులు: ఏసీబీ
ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనలకు విరుద్దంగా ఎఫ్ఈఓకు నిధులు చెల్లించారని ఏసీబీ ఆరోపించింది. ఈ మేరకు హైకోర్టులో డిసెంబర్ 27న కౌంటర్ లో తెలిపింది. కేబినెట్, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండానే ఈ నిధుల చెల్లింపులు జరిగాయని..
ఇందుకు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలే కారణమని ఏసీబీ ఆరోపించింది. కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం అసంబద్దమైందని ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి నష్టం కలిగింది. అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని ఏసీబీ ఆ కౌంటర్ లో వివరించింది.