ఇప్పటి వరకూ మేడారం హుండీ లెక్కింపుల ఎంతో తెలుసా?
తెలంగాణ కుంభమేళాగా ఎంతో ప్రసిద్ది గాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర గత వారం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ జాతరలో ఎంతో మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు.
తెలంగాణ కుంభమేళాగా ఎంతో ప్రసిద్ది గాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర గత వారం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ జాతరలో ఎంతో మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భక్తులు తమ కానుకలను వేయడానికి 494 హుండీలను ఏర్పాటు చేసారు. వీటిలో 452 మామూలు హుండీలు, 24 బట్టతో చేసిన హుండీలు, మరో మూడు వడిబియ్యం హుండీలు ఉంచారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనంతరం ఆ హుండీలను భద్రంగా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి చేర్చారు. అనంతరం ఆ హుండీల లెక్కింపు ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించారు. ఇందుకు గాను ప్రతిరోజు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
అందులోనూ బృందాల వారీగా ఈ లెక్కింపును కొనసాగిస్తున్నారు. హుండీలు తెరిచేందుకు ఓ టీం, బెల్లం, పసుపు, కుంకుమ అంటిన నోట్లను, వస్తువులను శుభ్రం చేసేందుకు ఒక బృందం, నోట్లు, వెండి, బంగారు వస్తువులను వేరు చేయడానికి మరో టీం, నోట్లను కట్టలుగా కట్టేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేసారు. లెక్కింపులో పాల్గొనే వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ను కూడా ఏర్పాట్లు చేసారు. ఇక 2018 జాతరలో రూ.10.70 కోట్ల ఆదాయం సమకూరిందని. ఈ సారి ఇప్పటివరకు 247 హుండీల్లోని కానుకలను లెక్కించగా రూ.7 కోట్ల ఆదాయం దేవాదాయశాఖ ఖాతాలో జమైందని దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
2018 జాతర సమయంలో లెక్కింపునకు వారం రోజుగా పట్టగా ఈసారి కాస్త ఆలస్యం జరుగుతుంది. జాతర చివరి రోజున భారీ వర్షం కురవడంతో హుండీల్లోకి వర్షపు నీరు చేరడం, బెల్లం, బియ్యంతో నోట్లన్నీ అతుక్కుపోతుండటంతో వాటిని శుభ్రం చేసి లెక్కించడానికి ఎక్కువ సమయం పడుతోందని ఆయన స్పష్టం చేసారు. ఈ లెక్కింపు మరో వారంపాటు కొనసాగనుందని దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఈ హుండీల్లో రూపాయి నాణేలు, రూ.2వేల నోట్లు, విదేశీ కరెన్సీ, రద్దయిన పాత రూ.500 నోట్లు కూడా హుండీల్లో బయటపడుతున్నాయి. దాంతో పాటుగానే బంగారు, వెండి కడియాలు, కుంకుమ భరిణెలు లాంటి కానుకలను కూడా భక్తులు సమర్పించుకున్నారు.