ముందస్తు ప్లాన్ ప్రకారమే ప్రియాంకను ట్రాప్ చేసి రేప్ అండ్ మర్డర్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. టోల్‌గేట్ దగ్గర ప్రియాంక స్కూటీని పార్క్ చేయడాన్ని గమనించిన నిందితులు అప్పుడే ట్రాప్‌కు స్కెచ్ గీశారు. అప్పటికే పీకల్లోతు మద్యం మత్తులో ఉన్న నిందితులు స్కూటీని పంక్చర్ చేసి ప్రియాంక కోసం ఎదురుచూశారు. ప్రియాంక రాగానే ఆమె దగ్గరకు వెళ్లి పంక్చర్ డ్రామాను మొదలుపెట్టారు. అసలు ప్రియాంక టోల్‌గేట్ దగ్గర స్కూటీని ఎప్పుడు పార్క్ చేసింది, మళ్లీ ఎప్పుడు తిరిగొచ్చింది, ఎప్పుడు ట్రాప్‌లో పడింది, ఎప్పుడు హత్యాచారానికి గురైందో తెలుసుకుందాం.
నవంబర్ 27 అంటే బుధవారం మధ్యాహ్నం మూడున్నరకి విధులు ముగించుకుని ఇంటికొచ్చిన ప్రియాంక, సాయంత్రం ఐదున్నర తర్వాత గచ్చిబౌలి వెళ్లడానికి తన స్కూటీపై బయల్దేరింది. సాయంత్రం ఆరున్నర తర్వాత తొండుపల్లి టోల్‌గేట్ దగ్గర స్కూటీని పార్క్ చేసింది. అయితే, అప్పటికే పీకల్లోతు మద్యం మత్తులో మునిగితేలుతోన్న నిందితులు ప్రియాంక స్కూటీని పార్క్ చేయడాన్ని గమనించి అప్పుడే ట్రాప్‌కు స్కెచ్ వేశారు.
సాయంత్రం 6:40 తర్వాత ప్రియాంక వెళ్లిపోగానే స్కూటీకి పంక్చర్ చేసి ఆమె రాక కోసం ఎదురుచూశారు. అయితే, రాత్రి 7గంటల సమయంలో మాదాపూర్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన ప్రియాంక రాత్రి 8గంటల తర్వాత అక్కడ పని ముగించుకుని బయటికొచ్చింది.
రాత్రి 9:15 సమయంలో ప్రియాంక టోల్‌గేట్ దగ్గరకు రావడంతో నిందితులంతా కలిసి పంక్చర్ డ్రామా మొదలుపెట్టారు. ప్రియాంక దగ్గరకు వచ్చిన ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా మేడమ్ మీ బైక్ పంక్చరైందంటూ మాటలు కలిపాడు. పంక్చర్ వేయించుకొస్తామంటూ నిందితుల్లో ఒకరికి స్కూటీని ఇచ్చి పంపాడు. అప్పుడే ప్రియాంక తన చెల్లికి ఫోన్ చేసి భయమేస్తోందంటూ చెప్పింది.
రాత్రి 9:45కి ప్రియాంక ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. ఆ తర్వాతే ప్రియాంకపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడి చిత్రహింసలు పెట్టారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు. అర్ధరాత్రి 12గంటల నుంచి ఒంటి గంట మధ్య ప్రియాంక డెడ్‌బాడీని దుప్పట్లో చుట్టి లారీలో తరలించారు. స్కూటీని కూడా తీసుకెళ్లిన నిందితులు పెట్రోల్‌ని కొనుక్కొచ్చి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద ప్రియాంక డెడ్‌బాడీని తగలబెట్టారు. అయితే, బుధవారం రాత్రే ప్రియాంక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించినా గురువారం తెల్లవారుజామున కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో ప్రియాంక మృతదేహం తగలబడటాన్ని గుర్తించిన స్థానికుడు పోలీసులకు సమాచారమివ్వడం, ఆ తర్వాత కుటుంబీకులు గుర్తించడంతో ప్రియాంక దారుణ హత్యకు గురైందనే సంగతి తెలిసింది. దాంతో, నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు గురువారం రాత్రి పది గంటల సమయంలో కొత్తూరు దగ్గర హైవేపై స్కూటీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నవంబర్ 29న అంటే శుక్రవారం ప్రియాంక కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడు మహ్మద్ పాషాతోపాటు మరో ముగ్గురు నిందితులు చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను అరెస్ట్ చేశారు. నిందితులందరూ నారాయణపేట జిల్లా మఖ్తల్ మండల వాసులు కాగా, పాషాది జక్లేర్ గ్రామం చెన్నకేశవులు, నవీన్, శివది గుడిగండ్ల గ్రామంగా తేలింది. అయితే, ప్రియాంకపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.