Lockdown: తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్
Pollution: హైదరాబాద్‌లో తగ్గిన వాయు కాలుష్యం * అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ సూచికంటే తక్కువగా నమోదు
Pollution: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ పర్యావరణపరంగా మంచి ఫలితాలనిస్తోంది. కర్ఫ్యూ, ఆ వెన్వెంటనే 'లాక్‌డౌన్' కొనసాగుతుండటం వల్ల వాయు నాణ్యత మెరుగుపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వాహనాల నుంచి వచ్చే దట్టమైన పొగ... పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యానికి లాక్‌డౌన్‌తో చెక్ పడింది. లాక్‌డౌన్ వల్ల నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని పర్యావరణవేత్తలు అంటున్నారు. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం... మళ్లీ ఇప్పుడు విధించిన లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గింది.
లాక్‌డౌన్‌తో నగరాలు, పట్టణాల్లో, ధ్వని కాలుష్యం తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన వారానికే హైదరాబాద్ నగరం గ్రీన్ జోన్ లోకి వచ్చింది. పరిశ్రమలు మూతపడటం, వాహన రాకపోకలు ఆగిపోవడంతో వాయు కాలుష్యం భారీగా తగ్గి నాణ్యత సూచిక మెరుగుపడింది. ఎప్పుడు కాలుష్యంతో సతమతయ్యే ప్రజలు ప్రస్తుతం స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున 25 పాయింట్లు నమోదయ్యాయి. తెలంగాణ పొల్యూషన్ బోర్డు ప్రకటించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాలు గమనిస్తే.. మలక్ పేట, బాగ్ లింగంపల్లిలో 25పాయింట్లు.. శేరిలింగంపల్లి, కొండాపూర్ లో 30పాయింట్లు, జూపార్క్ వద్ద 41 పాయింట్లు నమోదయ్యాయి. లాక్ డౌన్ కు ముందు ఈ ప్రాంతాల్లో 90 నుంచి 110 పాయింట్లుగా వాయు కాలుష్యం నమోదయ్యేది. మొత్తంగా లాక్‌డౌన్ వల్ల పర్యావరణపరంగా మంచి ఫలితాలనిస్తోందని నిపుణులు చెబుతున్నారు.