రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి
ఎన్నో ఏళ్ల కట్టడం ఎంతో చరిత్ర కలిగిన బొల్లారం రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి తాకనుంది.
ఎన్నో ఏళ్ల కట్టడం ఎంతో చరిత్ర కలిగిన బొల్లారం రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి తాకనుంది. ప్రతి ఏడాది భారత దేశ రాష్ట్రపతిగా నియమితులైన వారు హైదారాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి వచ్చి 15 రోజుల పాటు శీతాకాల విడిది చేయడం గమనార్హం. రాష్ట్రపతి విడిది చేసి వెళ్లిన తరువాత రాష్ట్రపతి నిలయాన్ని సందర్శనార్థం వారం రోజుల పాటు సందర్శకులని అనుమతిస్తారు. ఇదే నేపథ్యంలో ఈ ఏడాదికూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గత నెల 28 వరకు ఇక్కడ బస చేశారు.
దీంతొ ఇవాళ్టి నుంచి అంటే జనవరి 2 నుండి జనవరి 17వ తేదీవరకు వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ రాష్ట్రపతి నిలయం సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో (25 వేల చదరపు అడుగుల ), దట్టమైన చెట్ల నీడలో నిర్మించారు. అక్కడ ప్రకృతి శోభితమైన, ఆహ్లాదకరమైన పచ్చదనం, ప్రశాంత వాతావరణం ఉంటుంది. భారీ వృక్షాలు వాటి మధ్య ఉద్యానవనాలు, పూలు, పండ్ల తోటలు, ఫౌంటెయిన్లు చూడముచ్చటగా ఉంటాయి. ఈ భవనాన్ని బ్రిటషు వారి పాలనలో అప్పటి వైస్రాయ్ నివసించడానికి నిర్మించారు. ఈ భవనంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి.
వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. కాలక్రమేణా ఈ భవనాన్ని నిజాం ప్రభువులు స్వాధీన పరచుకున్నారు. 1950లో కేంద్ర ప్రభుత్వం ఆ భవానాన్ని రూ.60 లక్షలకు కొని దక్షిణాదిలో రాష్ట్రపతికి విడిదిగా తీర్చిదిద్దారు. దీంతో ప్రతి ఏడూ రాష్ట్రపతి వారం నుంచి పదిహేను రోజులుండి విడిది చేస్తారు. అదే సమయంలో ఆయన్ని కలవాలనుకున్న నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రముఖులు వచ్చి కలుస్తారు. ఈ ప్రకృతి అందాలతో పాటు రాష్ట్రపతి నిలయాన్ని మరింత అందంగా మలిచేందుకు గత ఏడాది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓకేసారి 7 వేల మొక్కలను నిలయంలోని ఖాళీ స్థలాల్లో నాటించారు. ఇక రాష్ట్రపతి నిలయంలోని వనాల గురించి చెప్పుకోవాలంటే ప్రవేశ ద్వారం రెండో గేటు వద్ద వేప, సపోట ఇలా మొత్తం 30 వరకు వనాలు ఉన్నాయి.
అంతే కాక ఈ ఉద్యానవనంలో ఔషధ, సుగంధ వనాలను కూడా పెంచుతున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వ్యవసాయానికి ఉపయోగించిన ఊటబావులు, పచ్చదనంతో నిలయం పరిసరాలు ఆకుపచ్చగా ఉన్నాయి. వాటితో పాటు రెండేళ్లక్రితమే సందర్శకులను మరింత కనువిందు చేయడానికి రాక్ గార్డెన్, జింకల పార్కులను కూడా ప్రారంభించారు. ఇక ఆ ప్రాంగనంలో ఊడలతో భారీ ఆకారాల్లో ఉన్న మర్రి వృక్షాలు రాష్ట్రపతి నిలయం చరిత్రకు అద్దం పడుతున్నాయి.