సీఏఏకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ సభకు పోటీ అన్నట్టుగా, తెలంగాణ బీజేపీ సభ నిర్వహించేందుకు సిద్దమవుతోందట. ఈ భారీ మీటింగ్‌కు విశిష్ట అతిథులు ఎవరో తెలుసా కేంద్రహోంమంత్రి అమిత్ షా. మరో విశిష్ట అతిథి ఎవరు తెలుసా...? ఆయన పేరింటేనే, కుర్రకారు హార్ట్ బీట్, జెట్ స్పీడ్‌తో ఉరకలెత్తుతుంది. తెలంగాణ గడ్డపై అమిత్ షాతో, ఆ లీడర్ సభ ఇదే మొదటిది అవుతుంది. ఇంతకీ సీఏఏ అనుకూల సభలో, అమిత్ షాతో పాటు పాల్గొనబోతున్న ఆ విశిష్ట అతిథి ఎవరు? ఈ గెస్ట్ ఎవరన్నది పక్కనపెడితే, ఈ ర్యాలీ ఏ ప్లేస్‌లో ఆర్గనైజ్ చెయ్యబోతున్నారో తెలుసా? అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే, ఈ స్టోరి చూడాల్సిందే.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారట. వచ్చేనెల మొదటి వారంలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభలో, ఆయన పాల్గొంటారట. జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర పర్యటన ఉంటుందని భావించినా, అది వాయిదా పడటంతో హోంశాఖ మంత్రి హోదాలోనే ఆయన పర్యటన ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్న సీఏఏపై అనుమానాలు తొలగించేందుకు, రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేయబోయే భారీ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభ సందర్భంగా ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమిత్ షా అధ్యక్షుడిగా తప్పుకున్న తరువాత, నడ్డా జాతీయ అధ్యక్షుడైనతర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బీజేపీ పటిష్టత పెంచడంతో పాటు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు మరింత విస్తృత పర్యటనలు చేయాలని నిర్ణయించింది బీజేపీ. తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలతో, ఇక టీఆర్ఎస్‌కు ప్రత్నాయ్నాంగా ఎదగొచ్చని భావిస్తోంది కాషాయ అధిష్టానం. అందుకు తగ్గట్టే అమిత్ షా సైతం, తెలంగాణ పర్యటనలకు ప్రాధాన్యమిస్తున్నారు.
తాజాగా, సీఏఏ వ్యతిరేకతను భారీస్థాయిలో చాటాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో, దీనికి వ్యతిరేకంగా సభ పెడితే, అందుకు అమిత్ షా వస్తే, పోలరైజేషన్‌తో, పార్టీ మూలాలు మరింత బలపడతాయని భావిస్తోంది రాష్ట్ర నాయకత్వం. అందుకే భారీ ఎత్తున సీఏఏ అనుకూల సభను నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ సభలో, అమిత్ షాతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పాల్గొనబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న తరువాత జరగబోతున్న, మొదటి సభ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సభను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందనడానికి మరో నిదర్శనం, అసదుద్దీన్ ఇలాకాలో సభ నిర్వహిస్తుండటం. పార్లమెంట్ వేదికగానే సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ బిల్లు ప్రతులను చించి నిరసన వ్యక్తం చేసిన అసదుద్దీన్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే, ఈ సభ నిర్వహించబోతున్నారట. పార్లమెంట్ లో క్యాబ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సీఏఏను విమర్శిస్తూ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలకు, గట్టిగా సమాధానం చెప్పేలా ఈ సభను ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. దీనికితోడు ఇప్పటికే ఎంఐఎంతో పాటు ఇతర ముస్లిం సంఘాలు నిర్వహించిన సభలు సక్సెస్ కావడంతో, ఈ సభకు భారీగా జనసమీకరణ చేసి సక్సెస్ చెయ్యాలని భావిస్తోంది రాష్ట్ర పార్టీ క్యాడర్. ఇందుకోసం ఇప్పటి నుంచే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, ఈ సభలో అమిత్ షా స్పీచ్ ఎలా ఉండబోతుంది..? కేసీఆర్, అసద్‌లను టార్గెట్ చేసి మాట్లాడుతారా..? సీఏఏపై జనాల్లో ఉన్న అపోహలను తొలిగించేందుకు ఆయన ఏం చెప్పబోతున్నారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వేదికగా జరుగనున్న ఈ సభలో వివాదాస్పద వ్యాఖ్యలకు ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఈ సభపై అందరి దృష్టి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్, తొలిసారి తెలంగాణ గడ్డపై అమిత్ షాతో కలిసి సభలో పాల్గొనబోతుండటం కూడా, ఈ సభపై ఉత్కంఠను పెంచుతోంది.