కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అవకతవకలపై NDSA పరిశీలన
Kaleshwaram: మూడోరోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు
Kaleshwaram: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్ ఆఫ్ వాల్- సీకెంట్ పైల్స్ కు సంబంధించిన డిజైన్ అమలులో తేడా ఉన్నట్లు ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డలో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్ ఆఫ్ వాల్- సీకెంట్ పైల్స్ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్‌వాల్స్ లేవని చెప్పినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. అన్నారం బ్యారేజీలో రాఫ్ట్ కిందనే సీకెంట్ పైల్స్ ఉంటే, మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్‌కు సీకెంట్ పైల్స్‌కు మధ్య ఒక మీటర్ తేడా ఉందని, దీనికి కారణమేంటని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. మూడో రోజు విచారణలో భాగంగా కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం నిన్న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో, నిర్మాణంలో పాలుపంచుకొన్న ఇంజినీర్లతో సుదీర్ఘంగా చర్చించింది. నిర్మాణ స్థలం నిర్ధారణలో మీ పాత్ర ఏంటి? ఇందులో సీకెంట్ పైల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, సీడీవో పాత్ర డిజైన్ వరకే పరిమితమా అని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీతో సంబంధం లేదని సీడీవో ఇంజినీర్లు చెప్పారు. వారు చెప్పిన ఆన్సర్స్ పై నిపుణుల కమిటీ లోతైన
విశ్లేషణలు అడిగింది. బోర్‌వెల్స్ డేటా గురించి పదే పదే ఎందుకు అడిగారని, మీకేమైనా అనుమానం వచ్చిందా అని కమిటీ.. వారిని ప్రశ్నించింది. రెండు కిలోమీటర్ల బ్యారేజీకి మూడు బోర్‌వెల్స్ డేటా సరిపోదని, పదేపదే ఒత్తిడి చేసిన తర్వాత 30 వరకు బోర్‌వెల్స్ డేటా ఇచ్చారని వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
ఎన్టీఎస్ఏ నిపుణుల బృందం మరిన్ని ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 2017 ఫిబ్రవరిలో డీపీఆర్‌కు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపితే 2016లోనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారని, ఇదెలా సాధ్యమైందని కమిటీ.. ఇంజినీర్లను అడిగింది. రాడార్ సర్వేలో డిపార్ట్‌మెంట్ ఇంజినీర్లు భాగస్వాములై ఉంటే వారి వివరాలు ఇవ్వాలని, బ్యారేజీలు ప్రారంభించిన తర్వాత ఎక్కువ వరద వివరాలు, బ్యారేజీల పైన, దిగువన చేసిన పరీక్షల రికార్డులన్నింటిపైనా సంతకాలు చేసి ఇవ్వాలని కమిటీ కోరింది. మేడిగడ్డ బ్యారేజీలో డీపీఆర్‌లో పేర్కొన్న దానికన్నా క్వాంటిటీస్ ఎందుకు పెరిగాయని అడిగినట్లు తెలిసింది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ నిన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్‌తో భేటీ అయింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీల్లో లోటుపాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేస్తోంది. విజిలెన్స్ విచారణ సందర్భంగా గుర్తించిన అంశాలపై వారి మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. జలసౌధలో చివరి రోజు విచారణ అనంతరం హిమాయత్‌సాగర్‌లో తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని కమిటీ సందర్శించింది. అక్కడ ఏర్పాటు చేసిన మేడిగడ్డ, ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను పరిశీలించింది.