రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో

* ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణకు నేడు శంకుస్థాపన

Update: 2022-12-09 04:37 GMT

రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో

Metro: హైదరాబాద్ అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మెట్రో రెండో దశ విస్తరణకు నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు చేపడుతున్న పనులకు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ అనంతరం తెలంగాణ పోలీసు అకాడమీలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. మొత్తం 6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను నిర్మిస్తారు. మైండ్‌స్పేస్-శంషాబాద్ మైట్రో లైన్ పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్..ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో మార్గంలో టౌన్‌షిప్‌లు, ప్రయాణికుల రద్దీ ఆధారంగా మొత్తం 8 నుంచి 9 స్టేషన్లను నిర్మిస్తారు. మైండ్‌స్పేస్ తర్వాత బయోడైవర్సిటీ, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, తెలంగాణ పోలీసు అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్ టౌన్, ఎయిర్‌పోర్టు కార్గోస్టేషన్, టర్మినల్ వద్ద స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో కమ్యూనికేషన్ బేస్ట్‌ ట్రైన్ కంట్రోల్ సాంకేతికతను వినియోగించనున్నారు. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మార్గంలో మాత్రం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా చర్యలు తీసుకోనున్నారు. రాయ్‌దుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 27 కిలోమీటర్ల దూరం ఉండగా కేవలం 26 నిమిషాల్లోనే ప్రయాణికులు చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

మెట్రో నిర్మాణంలో ఒక కిలోమీటరు రోడ్ లెవల్‌లో, 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మార్గంలో ట్రాక్ నిర్మాణం ఉంటుంది. మెట్రో రెండో దశ కింద రాయదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 32 కిలోమీటర్ల పనులకు సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా BHEL నుంచి కొండాపూర్, గచ్చిబౌలిమీదుగా టోలిచౌకీ, మెహదీపట్నం, లక్డీకపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మరో 5 కిలోమీటర్లు దూరం కలిపి మొత్తం 62 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవే మార్గాలు కాకుండా భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించేలా ప్రతిపాదనలను హైదరాబాద్ యునిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ రూపొందించింది.

Tags:    

Similar News