Telangana: వడగాలుల ముప్పు...తస్మాత్ జాగ్రత్త
Hyderabad: శుక్ర, శనివారాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Telangana: ఒక వైపు సేకండ్ వేవ్ తో ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనా... మరో వైపు పూర్తి ఎండాకాలం రాకముందే వడగాలుల ముప్పుతో ప్రజల అల్లాడిపోతున్నారు. మారిన మానవుని జీవనశైలితో ప్రకృతి వైపరీత్యాలకు పరాకాష్టంగా చెప్పుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే...రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉంది. శుక్ర, శనివారాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాలకు ఈనెల ఆరోతేదీ వరకు ప్రమాదం ఉందని ప్రకటించింది. భానుడు నిప్పులు కురిపిస్తుండగా.. వాతావరణంలోని కాలుష్యం కారణంగా వేడి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణతోపాటు హైదరాబాద్ నగరం కూడా వేడెక్కుతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని యంత్రాంగం సూచిస్తోంది.
నగరంలో....
నగరంలో జీహెచ్‌ఎంసీ, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతల హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంటోంది. ఈ ఏడాది మొదటి వడగాలుల తీవ్రత ఖమ్మంలో నమోదైంది. ఆ జిల్లాలో వరుసగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతోపాటు 18 జిల్లాలను వడగాలుల తీవ్రత జాబితాలో చేర్చారు. కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మరింత ముప్పు ఉంది. ఈ నెల 2 నుంచి 6 వరకు ఈ జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రాంతంలో కొద్దిరోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగినా, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనా ఆ ప్రాంతంలో వడగాలుల తీవ్రత ఉన్నట్లు అంచనా వేస్తారు.
చాలా జిల్లాల్లో...
చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఎక్కువ సమయం ఆరుబయట ఉంటే శరీరం వాతావరణంలోని వేడిని గ్రహిస్తుందని, ఇది ప్రమాదకరమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు నీడపట్టున ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే వడదెబ్బ తాకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఫ్యాన్లను తక్కువ వేగంతోనే తిప్పాలని, ఏసీలు 24 డిగ్రీలలోపే ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.