ఆ ఎమ్మెల్సీ సీటు కోసం అరడజను నేతలు క్యూకట్టారు. ఒకరు పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటుంటే మరొకరు మంత్రి కేటీఆర్ ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకరు మాజీ ఎంపీ కవితను నమ్ముకున్నారు. మరికొందరు తమ తలరాతను నమ్ముకుని గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం రెండేళ్ల లోపే పదవీ కాలం ఉన్న ఆ ఎమ్మెల్సీ సీటుకు, అధికార పార్టీలో పోటాపోటీ అంతాఇంతా కాదు.
నిజామాబాద్ స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి అనర్హతతో నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానానికి ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం ఉండటంతో ఆ స్ధానం గులాబీ ఖాతాలో చేరనుంది. పార్టీ అభ్యర్ధిత్వం ఖరారైతే చాలు ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండటంతో గులాబీ పార్టీలో ఈ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. సుమారు అరడజను నేతలు నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం కోసం అధినేతను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఈ పదవీ కాలం 2022 జనవరి వరకే ఉంది. కేవలం రెండేళ్లలోపు ఉన్నా వచ్చిన అవకాశం వదులుకోవద్దని ఆశావాహులు సైలెంట్ గా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు అరడజను నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారట. నిన్నటి వరకు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు ఎమ్మెల్సీగా ఖరారవుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. ఐతే ఆయన పేరును పార్టీ అధినేత రాజ్యసభకు ఖరారు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి మండవ రేసులో ఉన్నారనే టాక్ నడుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు తగిన గుర్తింపు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోందట. మండవతో పాటు, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితునిగా పేరున్న మాచారెడ్డికి, టీఆర్ఎస్ నేత నర్సింగ రావు, మాజీ ఎంపీ కవిత అనుచరునిగా ముద్రపడ్డ కామారెడ్డి జిల్లా మైనార్టీ నేత ముజుబుద్దిన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు పదవికి పోటీ పడుతున్నారట. ఐతే అధిష్ఠానం మాత్రం, మాజీ మంత్రి మండవ వైపు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. కొందరు మాత్రం మండవ ఏంటి ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం ఏంటని అంటున్నారట.
మండవ సైతం ఈ పదవి విషయంలో కొంత అయిష్టంగానే ఉన్నారనే టాక్ తెలుస్తోంది. ఒకవేళ మండవ నో చెబితే కామారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు పదవి దక్కే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఐతే సీఎం కేసీఆర్ కు మండవ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు ఇంతకు మించి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు పెద్ద దిక్కు లేదని భావిస్తున్న తరుణంలో మండవకు ఎమ్మెల్సీ ఇస్తే ఆయనకు మంత్రి పదవి సైతం వచ్చే అవకాశం ఉందనే టాక్ సైతం ఉంది. మండవకు పదవి కట్టబెడితే జిల్లాలో కొంత బలహీనమైన గులాబీ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందటున్నారు పార్టీ క్యాడర్. దీంతో పార్టీ అధిష్ఠానం మండవను ఒప్పించి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు సీనియర్లు. ఒకవేళ మండవ పదవి వద్దని గట్టిగా వాదిస్తే మాత్రం ఆయన అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేరును పరిశీలించే అవకాశం ఉందట.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పదవి ఆశావాహులను ఊరిస్తున్నా కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో అంతుచిక్కడం లేదు. చూడాలి ఆ రెండేళ్ల పదవీ కాలం ఉన్న పదవి ఏ నేతను వరిస్తుందో.