కట్టుకున్నోడి కిరాతకం.. పాలు విరిగిపోయాయని భార్య ప్రాణం పోయేల కొట్టిన భర్త

కోఠికి చెందిన హీనా బేగంకు ఎల్లారెడ్డి గూడకు చెందిన కారు డ్రైవర్ అక్మల్ హుస్సేన్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

Update: 2024-05-30 07:38 GMT

కట్టుకున్నోడి కిరాతకం.. పాలు విరిగిపోయాయని భార్య ప్రాణం పోయేల కొట్టిన భర్త

Hyderabad: కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. పొయ్యిపై వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో అత్తింటి వారు ఆ అబలపై తమ ప్రతాపం చూపారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ రాచి రంపాన పెట్టారు. ఒళ్లంతా వాతలు తేలేలా మెటల్ పైపుతో కాల్చారు. మూడు రోజులుగా గదిలో బంధించి కొట్టి నరకం చూపారు. ఈ అమానవీయమైన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది.

కోఠికి చెందిన హీనా బేగంకు ఎల్లారెడ్డి గూడకు చెందిన కారు డ్రైవర్ అక్మల్ హుస్సేన్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కట్నకానుకల కింద 2 లక్షల నగదు, నాలుగున్నర తులాల బంగారం, ఇతర లాంచనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే.. అప్పటికే అక్మల్ హుస్సేన్‌కు మొదట పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టారు. తర్వాత హీనాకు తెలిసినా సర్దుకుపోయింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త అక్మల్ హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరుదులు తబ్రేజ్, మరిది అయ్యూబ్ కలిసి హీనాను శారీరకంగా, మానసికంగా హింసించారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని ఆమెను చీటికిమాటికి కొట్టారు. కూతురు కాపురం బాగు పడుతుందన్న ఆశతో అప్పు చేసి 2.50 లక్షలు వరకు అత్తింటి వారికి ముట్టజెప్పారు.

అయినా హీనాకు అత్తింటి వారి వేధింపులు తగ్గలేదు. కాగా, అత్తింట్లో పొయ్యిపై పాలు వేడి చేసి మరిగించే సమయంలో పాలు విరిగిపోయాయి. దీంతో ఆగ్రహానికి గురైన భర్త, అత్త, ఆడపడుచు, మరిది కలిసి ఆమెపై మెటల్ పైపుతో విచక్షణారహితంగా చితకబాది, ఇంట్లోనే మూడ్రోజుల పాటు నిర్బంధించారు. ఒళ్లంతా గాయాలతో కమిలి పోయింది. మీ కూతురు చనిపోయిందంటూ ఆమె పుట్టింటి వారికి ఫోన్ చేసి చెప్పారు. అపస్మారకస్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. అత్తింటివారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం అమీర్‌పేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News