Khairatabad Ganesh: ఈసారి కూడా రికార్డులు బ్రేక్..ఖైరతాబాద్ మహాగణపతి ఎత్తు ఎంతో తెలుసా?

Khairatabad Ganesh: మరో మూడు నెలల్లో వినాయక చవితి రానుంది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారు పనులు షురూ అయ్యాయి. వినాయకుడి ఏర్పాటు కోసం ఖైరతాబాద్ గణేశ్ మండలి సోమవారం కర్రపూజ నిర్వహించింది. ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎంత ఎత్తు ఉండనున్నాడో తెలుసా?

Update: 2024-06-18 00:42 GMT

Khairatabad Ganesh: మనదేశంలో జరుపుకునే అన్ని పండగల్లో వినాయక చవితి చాలా స్పెషల్. దేశంలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత హైదరాబాద్ లో వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుతారు. నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిపొందింది. గత ఏడాది ఖైరతాబాద్ గణపతి తన ఎత్తుతో ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఏడాది కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఖైరతాబాద్ మహాగణనాథుడు.

నగరంలో ఎన్ని వినాయకులున్నా..ఖైరతాబాద్ వినాయకుడికి మాత్రమే ఆ ఆదరణ ఉంటుంది. ఈ లంబోదరుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ తయారీ పనులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయకచవితి పండగను జరుపుకోనున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ మండలి నిర్వాహకులు ఈ సంవత్సరం కొలువుదీరే విగ్రహం ఏర్పాటుకు కర్రపూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

ఈ ఏడాది వినాయకుడి ఎత్తు:

ఈ ఏడాది వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్ లో 70 అడుగల మట్టి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఖైరతాబాద్ లో మహాగణపతిని 1954లో ప్రతిష్టించారు. ఈ ఏడాదితో మహాగణపతికి 70ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టితో తయారు చేయడంతో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పుడు 70 అడుగుల ఎత్తులో వినాయకుడి తయారు చేస్తుండటంతో ఈ హైట్ తో ఖైరతాబాద్ గణేషుడు తన పేరుమీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక కర్ర పూజ అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. గణేశ్ ఉత్సవాలకు ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు తీసుకుంటామన్నారు. తొలిపూజ గవర్నర్ నిర్వహిస్తారన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వివరించారు దానం నాగేందర్.

Tags:    

Similar News