Ganesh Immersion in Hyderabad: వెళ్లి రావయ్య గణపయ్య
Ganesh Immersion in Hyderabad: హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు అనగానే.. వెంటనే గుర్తుకు వచ్చేవి.. ఖైరతాబాద్ గణేశుడు. రికార్డు స్థాయిలో ధర పలికే .. బాలాపూర్ గణేశుడు లడ్డూ వేలం. కానీ కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది.
Ganesh Immersion in Hyderabad: హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాలు అనగానే.. వెంటనే గుర్తుకు వచ్చేవి.. ఖైరతాబాద్ గణేశుడు. రికార్డు స్థాయిలో ధర పలికే .. బాలాపూర్ గణేశుడు లడ్డూ వేలం. కానీ కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది. ఊరేగింపులు, లడ్డూ వేలం పాటలు లేకుండానే సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సహంగా జరిగే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ రద్దు చేసింది. పోలీసుల నిబంధన మధ్య శోభ యాత్ర నిర్వహించారు.
అలాగే.. ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడు ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్నాడు. కరోనా నేపథ్యంలో వినాయకుడి ఎత్తు తగ్గించారు. ఈసారి 6 అడుగుల ఎత్తులోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర కొనసాగింది.. చివరకు ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తి అయ్యింది. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనం కంటే ముందు.. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. బై బై గణేశా నినాదాలతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు మార్మోగిపోయాయి.
కరోనా వైరస్ సంక్రమణ క్రమంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్నచిన్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది.