సీఎం సార్‌ సీటు మారుస్తారా?.. గజ్వేల్‌ టు నల్లగొండ వయా ఆలేరు?

CM KCR: తన సీటును ఎందుకు మార్చాలనుకుంటున్నారు?

Update: 2022-06-09 09:28 GMT

సీఎం సార్‌ సీటు మారుస్తారా?.. గజ్వేల్‌ టు నల్లగొండ వయా ఆలేరు?

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈసారి సీటు మారుస్తున్నారా? గజ్వేల్‌కు బైబై చెప్పేసి కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారా? ఏదో కొత్త వ్యూహం ఆలోచించే, గులాబీ బాస్‌ గజ్వేల్‌ను వీడాలని అనుకుంటున్నారా? కారు పార్టీ అధినేత ఆలోచిస్తున్న ఆ మాస్టర్‌ ప్లాన్‌ ఏంటి? గజ్వేల్‌ నుంచి కాకుండా ఇంకెక్కడ గులాబీ కర్చీఫ్‌ వేయబోతున్నారు? కారు స్టీరింగ్‌ను వారసుడికి అప్పగిస్తూ ఢిల్లీ స్థాయిలో రాజకీయలను శాసించాలని బావిస్తున్నారా? కేసీఆర్‌ లేటెస్ట్‌ స్కెచ్‌పై తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఆ లేటెస్ట్‌ డిస్కషన్‌ ఏంటి?

టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోగశాల చేసి గెలుపు బాటలో నడిచారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఉద్యమకాలంలో తెలంగాణ నలుగు చెరుగులా పోటీ చేసి విజయ ఢంకా మోగించారు. రాష్ట్ర సాధన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి పోటీ చేసిన గులాబీ బాస్ ఘన విజయం సాధించారు. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులలో కేసీఆర్ ఈసారి తన సీటు మార్చుకుంటారన్న చర్చ జోరుగా జరుగుతోంది.

తెలంగాణ వచ్చిన కొత్తలో అంటే 2014లో ఆ తర్వాత ముందస్తుకు వెళ్లిన 2018లోనూ కేసీఆర్ గజ్వేల్ నుంచే గెలిచారు. ఆ రెండుసార్లు తన పార్టీని అధికారంలోకి తెచ్చారు. తానే ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే, ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారడంతో గజ్వేల్‌ నుంచి కాకుండా, ఈసారి మరో నియోజకవర్గానికి మారబోతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీక్ ఇస్తున్నాయి. కేసీఆర్ కూడా ఈ అంశంపై క్లారిటీగా ఉన్నారన్నది గులాబీ నేతల మాట. కేసీఆర్‌ రెండుసార్లు గజ్వేల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే.. రెండుసార్లూ గట్టి పోటీ ఇచ్చిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఓసారి టీడీపీ తరపున మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రెండుసార్లూ తానే గెలిచేస్తారన్నంతగా పోటీ ఇచ్చిన వంటేరు చివరకు ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలతో ప్రతాప్‌రెడ్డి కారెక్కారు.

ఈసారి అసెంబ్లీ కంటే, పార్లమెంట్‌కు పోటీ చేయాలన్న ఆసక్తిని చూపిస్తున్నారట కేసీఆర్‌. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన గులాబీ అధినేత ఈసారి కచ్చితంగా ఎంపీగా గెలిచి, ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో గజ్వేల్ నుంచి తనకు బదలుగా టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేస్తారని కారు పార్టీలో టాక్‌ వినిపిస్తోంది. ఈమేరకు వంటేరుకు అధినేత సంకేతాలు కూడా ఇచ్చారన్న చర్చ నడుస్తోంది. అందుకే ప్రతాప్‌రెడ్డి కూడా ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారట. వాస్తవానికి, గజ్వేల్‌ నియోజకవర్గంపై పట్టు కలిగిన ప్రతాప్‌రెడ్డికే అవకాశం ఇస్తే తప్పకుండా అక్కడ గెలుస్తాడని కేసీఆర్‌ భావిస్తున్నారట. కానీ, గజ్వేల్‌కు చెందిన పాత నాయకులు మాత్రం నిన్న కాక మొన్న వచ్చిన ఒంటేరుకు ఎలా సీటు ఇస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

ఇదంతా ఎలా ఉన్నా కేసీఆర్ గజ్వేల్ ను వీడటానికి గల కారణం ఏంటీ అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంలో గులాబీ అధినేత లేరని, అందుకే గజ్వేల్ నియోజకవర్గాన్ని మరొకరికి అప్పగించే యోచన చేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే, ఇది ప్రచారమేనో, లేక నిజమో అంతకుమించిన రాజకీయ వ్యూహమో కానీ దీని వల్ల టీఆర్ఎస్‌ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నది పరిశీలకుల మాట. కానీ అవన్నింటినీ లెక్క చేయకుండా కేసీఆర్‌ ఖతర్నాక్‌ ప్లానొకటి ఆలోచిస్తున్నారట. జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకున పెట్టేలా, తెలంగాణలో కారు స్టీరింగ్‌ను తర్వాతి తరానికి అందించేలా కేసీఆర్ అనూహ్య అడుగులు వేయబోతున్నారట. అందుకే గజ్వేల్‌ అసెంబ్లీని వీడి, ఢిల్లీ బాట పట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారట. తద్వారా మారనున్న పరిణామాల్లో తన వారసుడు, ప్రస్తుత మంత్రి కేటీఆర్‌కు జాక్ పాట్ తగలొచ్చనే చర్చ కూడా నడుస్తోంది.

తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోవచ్చన్నది దాదాపు కన్ఫామేనంటున్నారు గులాబీ నేతలు. ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బరిలోకి దిగుతారనే లీకులు వస్తున్నాయి. ఆ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో ఉద్దండ రాజకీయ నాయకులు ఉండటం వల్ల అలాంటి జిల్లాలో తాను పోటీ చేస్తే గులాబీ పార్టీకి మరింత బలం అక్కడ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ భావిస్తున్నారట. వీలైతే, తెలంగాణ వెంకటాద్రి తరహాలో యాదాద్రిని రూపొందించిన కేసీఆర్‌ ఆ దేవాలయం ఉన్న ఆలేరు నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మరో చర్చ కూడా జరుగుతోంది. కాకపోతే, అది సాధ్యం కాకపోవచ్చన్న టాక్‌ ఉంది. ఒకవేళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయడానికి వీలుంటే సరే, లేదంటే తాను ఇంతకుముందు పోటీ చేసి గెలిచిన మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది.

జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌ దేశాన్ని గాడిలో పెట్టేలా ప్రజలు తనను ఆశీర్వదించాలంటూ పదేపదే కోరుతున్నారు. పైగా ప్రస్తుతం మెదక్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి లోక్‌సభకు కాకుండా దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా కేసీఆర్‌ పార్లమెంటుకు వెళతారన్న అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి శాసనసభలో అడుగు పెట్టాలని కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలా ఆయనకు చాన్స్‌ రావొచ్చన్న చర్చ ఉంది. దీనిపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డికి సూచన చేసినట్టు సమాచారం.

గతంలో ఎంపీగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి ఆ తర్వాత దక్షిణ తెలంగాణ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించిన కేసీఆర్ నిజమైన తెలంగాణ నేత అనిపించుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు మరోమారు కేసీఆర్‌ నియోజకవర్గం మార్పు చేసుకున్నారనే చర్చ ఊపందుకుంది. కేసీఆర్ నియోజవర్గ మార్పు ప్రచారం అసలైనదో.. కాదో త్వరలో తెలుస్తుందంటున్నగులాబీ నేతలు అధినేత వ్యూహం ఏమిటో అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు. కాకపోతే, కేసీఆర్ గనుక అసెంబ్లీకి పోటీ నుంచి దూరంగా ఉంటే ప్రత్యర్థులు దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అందుకే, పార్టీకి మరింత ప్రయోజనం చేకూరేలా వేరే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగి, ఆ తర్వాత ఆరు నెలలకే సీఎం పదవిని కొడుకుకు అప్పగించి కేసీఆర్ లోక్‌సభలోకి అడుగుపెట్టొచ్చని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఊహాగానాలే కానీ, ఏవీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Full View


Tags:    

Similar News