KCR: మాజీ సీఎం కేసీఆర్ బయటకు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
KCR: కారు పార్టీ 6-8 ఎంపీ సీట్లు గెలుస్తోందని జోస్యం చెప్పిన కేసీఆర్
KCR: కేసీఆర్ కోలుకుని బయటకు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కొంత కాలంగా డీలా పడ్డ గులాబీ సైన్యం నూతనోత్తేజంతో పనిచేస్తామంటున్నారు. పార్టీ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలతో కారు పార్టీ నేతలు కంగారు పడ్డారు. కేసీఆర్ కోలుకుని బయటకు రావడంతో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉషారుతో ఉంది పార్టీ క్యాడర్. కేసీఆర్ సైతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయి పలు కీలక సూచనలు చేసేసరికి లీడర్లంతా నెమ్మదిగా సర్దుకుంటున్నారు.
తుంటి ఎముక విరగడంతో చాలా కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్.... గురువారం రోజున గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ర సాయంతో నడుచుకుంటూ బయటకు రావడంతో గులాబీ సైన్యం ఆనందంలో ఉంది. అయితే పార్టీ నేతల తీరుపై ఇంత కాలం జరుగుతన్న చర్చకు పులిస్టాప్ పెట్టారు. కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం పార్టీలో పెద్దదూమారం రేగింది. దీంతో ఎవరికి వారు తమను తాము సమర్దించుకునే పనిలో పడ్డారు.
గతంలో కేసీఆర్ సర్కార్ రెండు పర్యాయయాలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో.... ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఆదే అస్త్రం ప్రయోగిస్తుందని అంతా భావించారు. దీంతో గులాబీ పార్టీ పెద్దలు అలెర్ట్ అయ్యారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో నందీనగర్‌లోని తన నివాసంలో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక వ్యాఖ్యలు చేశారట కేసీఆర్. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని... ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని సూచించారు. మంచి ఆలోచనతో ప్రభుత్వ పెద్దలను కలిసినా... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని... కానీ అది ప్రజల మధ్యే ఇవ్వాలని సూచించారు. సీక్రెట్‌గా ఎవరినీ కలవొద్దన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి, రెండు సీట్లు కూడా రావని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారని తెలుస్తోంది. 6 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్‌కు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారట. ధైర్యంగా ఎన్నికల బరిలో కొట్లాడాలని సూచించినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్‌ను బొందపెడతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు గమనిస్తున్నారని.... ఓపికతో పనిచేసుకుంటూ వెళ్లాలని తెలిపారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందన్నారు.
కేసీఆర్ రాకతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉంటే... ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరిని నొప్పించకుండా.... తనపని తాను చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు. రాజకీయాల్లో చాణక్యుడిగా వ్యవహరించే కేసీఆర్... రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన జోస్యం చెప్పారట. ఈ సర్కార్ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంచనా వేశారట.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారట. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని... ఎమ్మెల్యేలను కేసీఆర్ ఉత్సాహపరిచారట. మొత్తానికి పార్టీ నేతలు, క్యాడర్లో ఉత్సాహం నింపడంతో పాటు తన ఎమ్మెల్యేలతో సామరస్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నట్టు అర్దం అవుతోంది.