Deeksha Diwas: కేసీఆర్ దీక్షతో మలుపు తిరిగిన తెలంగాణ ఉద్యమం
Deeksha Diwas: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ ఆమరణ దీక్ష కీలకమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించి నేటికి 15 ఏళ్లు.
Deeksha Diwas: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ ఆమరణ దీక్ష కీలకమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించి నేటికి 15 ఏళ్లు. అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు, తెలంగాణ భవన్ లో కవిత ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైద్రాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని దీక్షా దివస్ మలుపు తిప్పింది. 2001 నుంచి 2009 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాలు జరిగాయి. 2009 నవంబర్ 28 లోపుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని... లేకపోతే నవంబర్ 29న ఆమరణ దీక్ష చేస్తానని 2009 నవంబర్ 5న కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేయడానికి ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పార్టీ కార్యాలయం నుంచి సిద్దిపేటలోని దీక్షా శిబిరానికి వెళ్తున్న కేసీఆర్ ను కరీంనగర్ అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను ఖమ్మం జైలుకు తరలించారు. జైలులో కూడా కేసీఆర్ దీక్షను కొనసాగించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు బలవంతంగా వైద్యులు సెలైన్లు ఎక్కించారని .. అయినా కేసీఆర్ దీక్షను కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ప్రకటించింది.
దీక్షను కొనసాగించాలని ఓయూలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఖమ్మం ఆసుపత్రిలో కేసీఆర్ దీక్షను కొనసాగించారు. డిసెంబర్ 7న ఏపీ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ ఏర్పాటు విషయమై సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయాలని సోనియా సూచన మేరకు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ దీక్ష టర్నింగ్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు సీఆర్ గౌరీశంకర్ చెప్పారు. అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా కొందరు ప్రజా ప్రతినిధులు చేసిన లాబీయింగ్ కు ఈ దీక్ష బ్రేక్ చేసిందని ఆయన అన్నారు.
14 ఎఫ్ ఉత్తర్వులు రద్దు కోరుతూ ఉద్యమం
ఉద్యోగాల నియామాకాల్లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన 14 ఎఫ్ ఉత్తర్వులు తెలంగాణ వాదులకు ఆగ్రహం తెప్పించాయి. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆరు జోన్లు మాత్రమే ఉన్నాయి. హైద్రాబాద్ ను ఫ్రీ జోన్ గా కానీ, ఏడో జోన్ గా కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ఎఫ్ ఆధారంగా హైద్రాబాద్ ను ఏడో జోన్ , ఫ్రీ జోన్ అంటూ అన్ని ఉద్యోగాలకు వర్తింపజేశారు.
ఈ ఉత్తర్వులతో తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై సుప్రీంకోర్టు హైద్రాబాద్ ఫ్రీ జోన్ అంటూ తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ హైద్రాబాద్ ను ఆరో జోన్ లో అంతర్భాగంగా గుర్తించాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తో 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో సభ నిర్వహించారు. ఈ సభలో 14 ఎప్ రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
అక్టోబర్ 28న జైల్ భరో నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నవంబర్ 28 లోపుగా స్పష్టమైన ప్రకటన చేయాలని లేకపోతే అమరణ దీక్షకు దిగుతానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష అంశాన్ని డిసెంబర్ 2న పార్లమెంట్ లో అద్వానీ ప్రస్తావించారు. డిసెంబర్ 3న కేసీఆర్ ను నిమ్స్ కు తరలించారు. డిసెంబర్ 6న 14 ఎఫ్ ను రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది.
సమైక్య ఆంధ్ర ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు. అయితే ఈ ప్రకటనతో సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుపై సంబరాలు సాగుతున్న తరుణంలో సీమాంధ్రలో నిరసనలు సాగాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ నాయకత్వం నష్ట నివారణ చర్యలు తీసుకుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పట్లో వ్యతిరేకించారు. పార్టీ నాయకత్వానికి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.ఈ పరిణామాల నేపథ్యంలో 2009 డిసెంబర్ 23న రాష్ట్ర విభజనపై అందరి అభిప్రాయాలను తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెలంగాణవాదుల్లో నిరాశ కలిగించింది.
సకల జనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చేసిన ప్రకటనను సీమాంధ్రలో ఉద్యమం పేరుతో కేంద్రం వెనక్కు తీసుకోవడంపై తెలంగాణ ప్రాంత వాసుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆందోళనలు సాగాయి. 2011 సెప్టెంబర్ 13 న ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు సకల జనుల సమ్మెను ప్రారంభించారు.42 రోజుల పాటు ఈ సమ్మె సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూత పడ్డాయి. 2011 అక్టోబర్ 16న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నుంచి బయటకు వచ్చారు. ఇతర సంఘాలు కూడా సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమ్మె తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ 2013 జూలై 31న ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో మరోసారి సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగాయి. రెండు నెలలు సమైక్యాంధ్ర ఉద్యమం సాగింది. కానీ,తెలంగాణ ఏర్పాటుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపింది.2013 అక్టోబర్ 3న జరిగిన కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను ఉమ్మడి ఏపీ శాసనసభకు, శాసనమండలికి పంపారు. అయితే ఈ బిల్లును తిరస్కరిస్తున్నట్టు అప్పటి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ బిల్లును వాయిస్ ఓటింగ్ ద్వారా తిరస్కరించినట్టు అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.శాసనమండలిలో కూడా మూజువాణి ఓటు ద్వారా బిల్లును తిరస్కరించినట్టు అప్పటి మండలి ఛైర్మన్ ఎ. చక్రపాణి ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లును రాష్ట్ర అసెంబ్లీ వ్యతిరేకిస్తూ తీర్మానించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఈ వెసులుబాటును ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో ఈ బిల్లును అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీజేపీ మద్దతుతో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఈ బిల్లు పాసయింది. దీంతో 2014 జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష సమయం సరైన సమయమని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఒక స్థాయికి వచ్చిన తర్వాత కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న సమయంలో కేసీఆర్ దీక్ష చేశారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం మలుపు తిరుగుతున్న సమయంలో కేసీఆర్ దీక్ష చేయడం..అదే సమయంలో కేంద్రం ప్రకటన చేయడం ఉద్యమానికి కలిసి వచ్చిందన్నారు.
జూన్ రెండు కంటే ముందే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో ఒక విడతలో, సీమాంధ్రలో మరో విడతలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకుంది. తెలంగాణ , ఏపీ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నష్టపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమైంది.